అప్పట్లో కృష్ణ సినిమా అనగానే మాస్ మసాలా అంశాలు పుష్కలంగా ఉండేవి. ఆయన సినిమాల్లో క్రైమ్ ఎలిమెంట్ తప్పనిసరిగా కనిపించేది. ఆ అంశాలతో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ నూ కలగలిపి రూపొందించిన చిత్రం ‘ఇన్ స్పెక్టర్ భార్య’. ఈ సినిమా 1972 ఆగస్టు 25న విడుదలై మంచి ఆదరణ పొందింది.
‘ఇన్ స్పెక్టర్ భార్య’ కథ ఏమిటంటే – కాలేజ్ లో విమల, రాజు కలసి చదువుకొంటారు. విమల అంటే రాజుకు ఎంతో ప్రేమ. ఆమె తన బావ అయిన పోలీస్ ఇన్ స్పెక్టర్ శ్రీధర్ ను పెళ్ళాడుతుంది. రాజు తండ్రి ఆ ఊరి ఛైర్మన్. అతను డబ్బు కోసం ఏదైనా చేసే మనిషి. ఆ తండ్రి కొడుకైన రాజు కూడా విమలపై పగ పెంచుకుంటాడు. శ్రీధర్, రాజు స్నేహితులు కావడంతో ఆ నెపం పెట్టుకొని విమల ఇంటిలో కాలు పెడతాడు రాజు. కాలేజ్ లో ఉన్నసమయంలో రాజు, విమల కలసి తీయించుకున్న ఫోటో చూపించి, ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తాడు. తాను అతడిని అన్నయ్యగా భావించానని, తన కాపురం కూల్చవద్దని, భర్తకు, కొడుక్కి దూరం చేయవద్దని బ్రతిమాలుతుంది విమల. శ్రీధర్ లేని సమయంలో విమలను లొంగ దీసుకోవాలనుకుంటాడు రాజు. ఆమె రివాల్వర్ తో అతడిని కాలుస్తుంది. భర్తకు తెలియకుండా నెట్టుకురావాలనుకుంటుంది. అయితే శ్రీధర్ ఆమెను అనుమానించి, అవమానిస్తాడు. దాంతో నిజం చెబుతుంది. అదంతా నిజం రాబట్టడానికే అలా చేశానని, అసలు ఆ రివాల్వర్ లో డమ్మీ బుల్లెట్స్ ఉన్నాయని శ్రీధర్ అంటాడు. రాజు ఎక్కడో బ్రతికే ఉంటాడని చెబుతాడు. బంగారు నగలతో పర్వదినాన ఊరేగే అమ్మవారి ఉత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తాడు శ్రీధర్. అమ్మవారి ఊరేగింపులో దర్శనం చేసుకోవడానికి విమల, తన కొడుకుతో వస్తుంది. రాజు, అతని తండ్రి అమ్మవారి నగలు దోచుకోవాలని ప్రయత్నిస్తారు. రాజు స్వామిజీగా మారువేషం వేసుకుంటాడు. నగలు దొంగిలించి వెళ్తూ, శ్రీధర్ కొడుకును చంపాలని చూస్తాడు రాజు. అతని బారి నుండి బాబును తెలివిగా కాపాడుకుంటుంది విమల. రాజుతో శ్రీధర్ తలపడతాడు. రాజు తండ్రి రివాల్వర్ తో శ్రీధర్ ను చంపబోతే, అది రాజుకే తగిలి చస్తాడు. పోలీసులు రాజు తండ్రిని అరెస్ట్ చేస్తారు. అమ్మవారి కరుణతో తమ కాపురం నిలచిందని అందరూ ఆనందించడంతో కథ సుఖాంతమవుతుంది.
శక్తి మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో కృష్ణ, చంద్రకళ జంటగా కనిపించగా, కృష్ణంరాజు, రాజబాబు, రాజనాల, అల్లు రామలింగయ్య, ధూళిపాల, ఆనంద్ మోహన్, రమాప్రభ, జ్యోతిలక్ష్మి, హలం, మమత, బెజవాడ చంద్రకళ, బేబీ శ్రీలత నటించారు. ఇందులో కృష్ణ, చంద్రకళ కొడుకుగా నటించిన బేబీ శ్రీలత, ఆ నాటి మేటి బాలనటి శ్రీదేవి సొంత చెల్లెలు కావడం విశేషం! ఇందులో శ్రీలతను చూడగానే అచ్చు శ్రీదేవిలాగే ఉందని జనం అనుకున్నారు.
కొడకండ్ల అప్పలాచార్య మాటలు రాయగా, దాశరథి, సినారె, అప్పలాచార్య పాటలు పలికించారు. కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చారు. కె.జయశేఖర్ నిర్మాత, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ ఎ.సి.త్రిలోక్ చందర్, కాగా ఈ చిత్రానికి పి.వి. సత్యనారాయణ రావు దర్శకత్వం వహించారు. ఇందులోని “రాధను నేనైతే… నీ రాధను నేనైతే…” పాట అన్నిటి కన్నా మిన్నగా ఆదరణ పొందింది. “పెళ్ళికి ఫలితం ఏమిటి…”, “చూడు చూడు చూడు…”, “కోపం చాలించు…కొంచెం ప్రేమించు…” అంటూ సాగే పాటలూ అలరించాయి. ఆ రోజుల్లో ‘ఇన్ స్పెక్టర్ భార్య’ మంచి ఆదరణ చూరగొంది.