The Kashmir Files వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన చిత్రం. మార్చి 11న థియేటర్లలో విడుదలైన The Kashmir Filesకి అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే సినిమాను తెరపైకి తీసుకురావడం మేకర్స్ కు అంత ఈజీ మాత్రం కాలేదట. ఈ విషయాన్ని డైరెక్టర్ వివేక్ భార్య, నిర్మాత, సినిమాలో కీలక పాత్రలో నటించిన నటి పల్లవి జోషి వెల్లడించింది. షూటింగ్ చివరి రోజులో తమపై ఫత్వా జారీ చేశారనే షాకింగ్ విషయాన్ని ఆమె బయట పెట్టారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి నటించిన ఈ చిత్రం 1990 కాశ్మీర్ తిరుగుబాటు సమయంలో జరిగిన కథతో రూపొందింది. ఈ చిత్రం 1990లో కాశ్మీర్ తిరుగుబాటు సమయంలో కాశ్మీరీ పండిట్‌లు అనుభవించిన క్రూరమైన బాధల వాస్తవ కథ.
Read Also : Ajith Kumar : 30 ఇయర్స్ ఇండస్ట్రీ… ఫ్యాన్స్ కు, హేటర్స్ కు స్పెషల్ మెసేజ్
“ఈ సినిమాకి అంకితం చేసిన నాలుగేళ్లలో కేవలం నెల రోజులు మాత్రమే షూటింగ్ చేశాం. మేము కాశ్మీర్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు మా పేర్లపై ఫత్వా జారీ చేశారు. అయితే అదృష్టవశాత్తూ అప్పటికి మేము సినిమా చివరి సన్నివేశం షూటింగ్ లో ఉన్నాము. త్వరగా ఈ సీన్ పూర్తి చేసి ఎయిర్ పోర్ట్ కి వెళ్దాం అని వివేక్ కి చెప్పాను. ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశం రాదు. కాబట్టి మేము ఆ సన్నివేశాన్ని పూర్తి చేసి, తరువాత అందరం అక్కడ నుండి బయలుదేరాము” అని చెప్పుకొచ్చారు. ఫత్వా అంటే ఇస్లామిక్ చట్టంలో అర్హత కలిగిన న్యాయ పండితుడి (ముఫ్తీ) ద్వారా ఒక అంశంపై అధికారిక తీర్పు ఇవ్వడం. 1989లో అయతుల్లా ఖొమేనీ ప్రవక్తను అవమానించినట్లు ఆరోపించిన నవలా రచయిత సల్మాన్ రష్దీని చంపాలని జారీ చేయడంతో ఫత్వా చాలా చర్చనీయాంశమైంది.
ఇక The Kashmir Files చిత్రంలో పుష్కరనాథ్‌గా అనుపమ్ ఖేర్, బ్రహ్మ దత్‌గా మిథున్ చక్రవర్తి, కృష్ణ పండిట్‌గా దర్శన్ కుమార్, రాధికా మీనన్‌గా పల్లవి జోషి, శ్రద్ధా పండిట్‌గా భాషా సుంబాలి, ఫరూక్ మాలిక్ అకా బిట్టాగా చిన్మయ్ మాండ్లేకర్ తదితరులు నటించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్, అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి మరియు వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ఐయాంబుద్ధ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌లపై నిర్మించారు.