సెప్టెంబర్ 10న విడుదల కాబోతున్న ‘లవ్ స్టోరీ’కి పోటీగా నాని ‘టక్ జగదీశ్’ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడాన్ని తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఖండించారు. కొద్ది వారాల క్రితమే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్ వరకూ సినిమాలను ఓటీటీలో విడుదల చేయవద్దంటూ కోరింది. కానీ ఆ విజ్ఞప్తిని పక్కన పెట్టి నిర్మాతలు ఓటీటీలో తమ సినిమాలను విడుదల చేయడంపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘లవ్ స్టోరీ’ విడుదల రోజునే ‘టక్ జగదీశ్’ను కావాలని అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేయాలనుకుంటోందని ఆరోపించారు. హీరో నాని, నిర్మాతలు ఈ విషయంలో చొరవ చూపి, అమెజాన్ ప్రైమ్ ప్రతినిధులతో మాట్లాడి, తమ చిత్రాన్ని మూడు, నాలుగు రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయించాలని కోరారు. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకోకపోతే… భవిష్యత్తులో ఎగ్జిబిటర్స్ తీసుకునే కఠిన నిర్ణయాలకు నిర్మాతలు ఇబ్బంది పడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఓటీటీ సంస్థలు థియేటర్లను మూసివేసే విధంగా ప్రవర్తిస్తున్నాయని, ఒకసారి అలా జరిగిన తర్వాత నిర్మాతలను తమ ఉక్కు పిడికిలిలోకి తీసుకుని ఉక్కిరి బిక్కిరి చేయడం ఖాయమని, ఈ వాస్తవాన్ని నిర్మాతలు గ్రహించాలని వారు కోరారు.
Read Also : తగ్గేదే లే… “దాక్కో దాక్కో మేక” సాంగ్ కు భారీ వ్యూస్
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ, ఏషియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ నారంగ్ మాట్లాడుతూ, ‘నిజానికి ఇది తమ ‘లవ్ స్టోరీ – టక్ జగదీశ్’ చిత్రాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, ప్రతి నిర్మాత సమస్య’ అని అన్నారు. ‘ఒక సినిమా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి థియేటర్లలో విడుదల అవుతుంటే, అదే రోజున మరో సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. నిర్మాతలను ఇలా ఇబ్బంది పెట్టే బదులు నాలుగు రోజుల తర్వాత ‘టక్ జగదీశ్’ను ఓటీటీలో విడుదల చేస్తే జరిగే నష్టం ఏమిటని?’ ప్రశ్నించారు. ‘ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద సినిమాలు పండగ సమయంలో విడుదలవుతున్నప్పుడే ఓటీటీ సంస్థలు తమ దగ్గర ఉన్న సినిమాలను పోటీకి విడుదల చేస్తాయని, అప్పుడు నిర్మాతలకు ఎంత నష్టం వాటిల్లుతుందో ఆలోచించాల’ని అన్నారు. సినిమాలను ఓటీటీలో విడుదల చేయకుండా ఆపలేమని, కాకపోతే పండగల సమయంలో మాత్రం ఓటీటీ కంపెనీలు సినిమాలను స్ట్రీమింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని ‘జెమిని’ కిరణ్ కోరారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, విజయేందర్ రెడ్డి తదితరులు తమ అభిప్రాయాలను తెలియచేశారు. మరి ఈ విషయంలో ‘టక్ జగదీశ్’ నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.