బిగ్ బాస్ షో చాలా చిత్రమైంది! దాన్ని ఎంతమంది హేట్ చేస్తారో…. అంతకు పదింతల మంది లవ్ చేస్తారు. పక్కవాడి జీవితంలోకి తొంగి చూడాలని ఎవరికి మాత్రం ఉండదు!! అదే బిగ్ బాస్ షో సక్సెస్ మంత్ర.
చుట్టూ నలభై, యాభై కెమెరాలు 24 గంటలూ పార్టిసిపెంట్స్ ను గమనిస్తూ, వారి చర్యలను కాప్చర్ చేస్తున్నప్పుడు… వారు వారిలా ఉండటం అనేది బిగ్ బాస్ లోని అన్ని టాస్క్ ల కంటే అతి పెద్ద టాస్క్. అందులోంచి ఓ గంట, గంటన్నర నిడివిని మాత్రం జనాలకు చూపించి, ఇందులో మీకు నచ్చిన వారెవరో చెప్పండి… అని అడగడం అసలు గేమ్! వారు వేసే ఓట్ల ఆధారంగా జరిగే విజేతల ఎంపికలో ఎంత న్యాయం ఉంటుందనేది పక్కన పెడితే, తెలుగులో ఇంతవరకూ జరిగిన ఐదు సీజన్స్ లో నాలుగు సీజన్స్ లో బిగ్ బాస్ కాస్తంత ఆవేశ పరులనే అందలం ఎక్కించాడనిపిస్తుంది.
ఎన్టీయార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1లో శివబాలాజీ ఆవేశం ఒక్కోసారి హద్దులు మీరి ఉండేది. చిత్రం ఏమంటే… ఒకానొక సమయంలో అతను బిగ్ బాస్ చర్యలను సైతం గట్టిగా ఖండించాడు. అప్పుడా షో లోనోవాలాలో వేసిన సెట్ లో జరిగింది. మహారాష్ట్రలో వర్షాలు విపరీతంగా పడుతుండటంతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు ఓ రోజు కాస్త మురికి నీళ్ళు సప్లయ్ చేశారు. ‘ఇలాంటి వాటర్ తో మమ్మల్ని స్నానం చేయమంటారా… ఇదేం పద్థతి ఇందుకోసం మేం ఇక్కడకి వచ్చామా?’ అంటూ బిగ్ బాస్ నే శివబాలాజీ నిలదీశాడు. ఆ తర్వాత కూడ మిగిలిన వారితో మోతాదుకు మించి ఆవేశపడుతూనే వచ్చాడు. చివరకు అతనే విజేతగా నిలిచాడు.
ఇక నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన సీజన్ 2లో కౌశల్ వ్యవహార శైలి గురించి పెద్ద చర్చే జరిగేది. అతనిలో అంత ఆవేశం ఎందుకూ? అని సాధారణ వీక్షకులు సైతం అనుకున్నారు. కానీ ఆ ఆవేశమే అతన్ని లక్షలాదిమందికి అభిమానులను చేసింది. కౌశల్ ఆర్మీ అంటూ ఓ పెద్ద టీమ్ క్రియేట్ అయ్యింది. దాని సాయంతో కౌశల్ బిగ్ బాస్ విజేతగా నిలిచాడు.
కింగ్ నాగార్జున బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయ్యింది మూడో సీజన్ తో. ఆ సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ ను చూసిన చాలామంది ఈ పోరగాడికి ఉన్న ఆవేశానికి మూడు, నాలుగు వారాలు మించి ఉండడనే భావించారు. కానీ స్వతహాగానే ఆవేశ పరుడైన రాహుల్ ఏకంగా బిగ్ బాస్ సీజన్ 3విజేతగా నిలిచాడు. అయితే ఆ తర్వాత సీజన్లో మాత్రం మిస్టర్ కూల్ అనిపించుకున్న అభిజిత్ కు బిగ్ బాస్ ట్రోఫీ అందించాడు. ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ హౌస్ లో అందరికంటే ఆవేశపరుడు అనిపించుకున్న సన్నీకి బిగ్ బాస్ టైటిల్ దక్కింది.
ఓవర్ ఆల్ గా చూసుకుంటే… ఎవరు నిజాయితీగా తమలా తాము ఉంటారు అనే దానికంటే… బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరి ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చిందనేదే అటు బిగ్ బాస్, ఇటు ప్రజలు గమనించి, ఓటు వేస్తున్నారని పిస్తోంది. శివబాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, తాజాగా సన్నీ… వీరంతా తమలోని ఆవేశానికి అడ్డుకట్టవేసి, బిగ్ బాస్ హౌస్ లోని పరిణామాలతో తమ జీవితాన్ని సరైన పంథాలోకి మార్చుకునే ప్రయత్నం చేశారు. అందుకే విజేతలుగా నిలిచారు. సో… ఆవేశం నుండి అణుకువవైపు అడుగులు వేసిన వారే విజేతలు అవుతారని ‘బిగ్ బాస్’ చెప్పకనే చెప్పాడని అనుకోవాలి!