Eagle: ఎట్టకేలకు అనుకున్నదే అయ్యింది.. సంక్రాంతి రేసు నుంచి ఈగల్ తప్పుకుంది. కొద్దిసేపటి క్రితమే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫ్లిమ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మొత్తం కలిసి సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడడం జరిగింది. ఇక ఈ చర్చల్లో సంక్రాంతి రేసు నుంచి ఒక సినిమా తప్పించడానికి చర్చలు జరిగాయి. ఈ మీట్ అనంతరం దిల్ రాజు.. ఈగల్ ను ఈ రేసు నుంచి తప్పుకున్నట్లు తెలిపాడు. మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. జనవరి 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. చివరి వరకు కూడా ప్రమోషన్స్ వదలకుండా చేశారు. అయితే చివరకు ఈగల్ వెనక్కి తగ్గింది.
“15 రోజుల క్రితం నిర్మాతలతో మీటింగ్ పెట్టి చర్చించాం.. గ్రౌండ్ రియాలిటి వివరించాం.ప్రతి ఏడాది ఉండే ఇబ్బందే ఇప్పుడు కూడా ఉంది.రవితేజ ఈగల్ సినిమా వెనక్కి వెళ్లేందుకు నిర్మాత అంగీకరించారు. ఈగల్ నిర్మాతకు, రవితేజకు థాంక్స్” అని నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్ తెలిపాడు. ఇక ఈ సినిమా ఫిబ్రవరికి కానీ, మార్చికి కానీ షిఫ్ట్ అయ్యినట్లు సమాచారం. ఈగల్ కోసం రెండు డేట్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఒకటి ఫిబ్రవరి 9 కాగా.. రెండోది మార్చి 8. ఇక ఫిబ్రవరిలో కనుక ఈగల్ వస్తే.. టిల్లు స్క్వేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉంది. మార్చిలో పెద్ద లిస్ట్ నే ఉంది. కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం ఈగల్ సింగిల్ రిలీజ్ డేట్ వచ్చేలానే చూస్తామని తెలుపడంతో రవితేజ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.