Balakrishna: గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో కన్నడ నటుడు ‘దునియా’ విజయ్ ప్రతి నాయకుడి పాత్రను పోషించాడు. బాలకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగిన తాను ఆయన చిత్రంలోనే విలన్ గా నటించడం ఆనందంగా ఉందని, బాలయ్య బాబు దేవుడిలాంటి మనిషి అని అంటున్నాడు ‘దునియా’ విజయ్. జనవరి 12న ‘వీర సింహారెడ్డి’ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో విజయ్ మీడియాతో మాట్లాడారు.
ఈ సినిమాలోని తన పాత్ర గురించి చెబుతూ, ”దర్శకుడు గోపీచంద్ మలినేని ఇందులో నా పాత్ర గురించి చెప్పినప్పుడే చాలా థ్రిల్ గా అనిపించింది. బాలకృష్ణ గారి సినిమాలో అవకాశం రావడమే గొప్ప విషయం. ‘వీరసింహారెడ్డి’ కథలో విలన్ పాత్ర ఒక పిల్లర్ లా వుంటుంది. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర. చాలా మొరటుగా వుంటుంది. నా పాత్ర పేరు ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి” అని చెప్పారు. బాలకృష్ణతో నటించిన అనుభవాన్ని వివరిస్తూ, ”బాలకృష్ణ గారు గొప్ప వ్యక్తిత్వం వున్న మనిషి. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది ఆయనతో కలసి నటించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. తొలిసారి ఆయన్ని సెట్ లో చూసినప్పుడు నన్నునేను నమ్మలేకపోయాను. ఫైట్స్ చిత్రీకరణ సమయంలో ఆయన ఎనర్జీ వేరే లెవెల్ లో ఉంటుంది. ఆయన ఎనర్జీ, పని పట్ల అంకితభావం గొప్పగా ఉంటాయి. అలాంటి ఎనర్జీ, డెడికేషన్ మాకూ కావాలి. బాలకృష్ణ గారిని ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ చూస్తున్నపుడు దేవుడు లాంటి మనిషి అనిపించింది. అలాంటి బాలకృష్ణగారిలో కలిసి నటించే అవకాశం రావడమే ఓ అదృష్టం” అని అన్నారు.
దర్శకుడిగానూ అనుభవం ఉన్న ‘దునియా’ విజయ్ ఆ వివరాలు చెబుతూ, ”నటన, దర్శకత్వం రెండు వేరు వేరు. దర్శకుడిగా నటుల నుండి యాక్టింగ్ రాబట్టుకోవాలి. నటుడిగా వున్నపుడు నా పని నటించడమే. నటుడిగా చేస్తున్నపుడు నా దృష్టి అంతా కేవలం నటనపైనే వుంటుంది. దర్శకుడు నా నుండి ఏం కోరుకుంటున్నారో దానిపైనే ఫోకస్ వుంటుంది. ఈ సినిమా దర్శకులు మలినేని గోపీచంద్ కు నా నటన గురించి అవగాహన ఉంది. దాంతో నన్ను ఈ పాత్రకు ఎంచుకున్నారు. ఆయన ఆశించిన రీతిలో నటించాననే అనుకుంటున్నాను” అని అన్నారు. ప్రస్తుతం విజయ్ ‘భీమా’ అనే సినిమాలో నటిస్తున్నారు. తెలుగులోనూ కొందరు తనను సంప్రదిస్తున్నారని, మంచి పాత్ర లభిస్తే విలన్ నటించడానికి సిద్ధమేనని చెప్పారు.