Dulquer Salmaan Speech At Sitaramam Pre Release Event: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘సీతారామం’ సినిమా ఆగస్టు 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఆగస్టు 3వ తేదీన హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేదికపై మాట్లాడిన దుల్కర్ సల్మాన్.. కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నాడు. ఈ సినిమా కోసం దర్శకుడు హను రాఘవపూడి ఎంతో కష్టపడ్డాడని, తనకు సమయం దొరికినప్పుడల్లా స్క్రిప్టుకి మెరుగులు దిద్దాడని అన్నాడు. ఫస్ట్ డ్రాఫ్ట్ చూసినప్పుడు చాలా చెత్తగా వచ్చిందని, కానీ కరోనా పుణ్యమా అని కాలం కలిసి రావడంతో హను రాఘవపూడి కథను మరింత బాగా డెవలప్ చేస్తూ వచ్చాడన్నాడు. కరోనా వల్లే ఈ సినిమా అద్భుతంగా డెవలప్ అవుతూ వచ్చిందన్న దుల్కర్, ఈ సందర్భంగా ఆ కరోనాకి ధన్యవాదాలు తెలిపాడు.
ఈ సినిమా పుణ్యమా అని తాను చాలా అందమైన ప్రాంతాల్ని విజిట్ చేశానని, ఆర్మీ జవాన్ జీవితాల గురించి మరిన్ని తెలుసుకున్నానని, ఇంకా మరెన్నో విషయాలు నేర్చుకున్నానని దుల్కర్ తెలిపాడు. ఇందులో సీత పాత్రలో మృణాల్ చాలా అద్భుతంగా నటించిందని, ఈ సినిమా తర్వాత ఆమె తన ఒరిజినల్ పేరు కంటే ‘సీత’గానే బాగా పాపులర్ అవుతుందని, అంత బాగా ఈ పాత్రలో ఒదిగిపోయిందంటూ చెప్పాడు. ఆమె తప్ప మరెవ్వరు ఈ రోల్‌లో సెట్ కాలేరన్నాడు. ఈ సినిమా ద్వారా తనకు సుమంత్ రూపంలో పెద్దన్నయ్య దొరికాడని, ఆయనొక పర్ఫెక్ట్ జెంటిల్మన్ అని కొనియాడాడు. అంతకుముందు అందరూ తనని చార్మింగ్ అంటారని, కానీ అశ్వినీదత్ చార్మింగ్ అని, ఆయన అందరినీ నవ్విస్తూ సరదాగా మాట్లాడుతుంటారని పేర్కొన్నాడు. అన్నింటికంటే ముందు.. స్పీచ్ ప్రారంభించడమే ప్రభాస్ పేరుతో. గ్లోబల్ స్టార్ తన ఈవెంట్‌కి రావడం ఆనందంగా ఉందన్న దుల్కర్, తాను ‘ప్రాజెక్ట్ సెట్స్’కి రెండు మూడు సార్లు వెళ్లానని, ఆ చిత్రం భారత చిత్రపరిశ్రమనే మార్చేస్తుందని చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాలో తనతో పాటు నటించిన ఇతర నటీనటులు సహా సాంకేతిక నిపుణులు ఎంతో కష్ట పడ్డారని, ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని దుల్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. తాను ఇంగ్లీష్‌లోనే ప్రసంగిస్తున్నందుకు క్షమాపణలు కోరాడు. త్వరలోనే తెలుగు నేర్చుకొని, తెలుగులోనే మాట్లాడటానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. ఇక చివర్లో తన ప్రసంగం ముగించడానికి ముందు, తొలిరోజు స్పాయిలర్స్ రివీల్ చేయొద్దని అభిమానుల్ని కోరాడు. ప్రతిఒక్కరినీ ఈ సినిమాని ఎంజాయ్ చేయొనివ్వండని, ట్విస్టులు బయటపెట్టొద్దని రిక్వెస్ట్ చేశాడు.