తెరపై ప్రతినాయకునిగా భయపెట్టినా, నిజజీవితంలో ఎంతో సౌమ్యులు, పది మందికి మేలు చేయాలని తపించేవారు డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి. ఆ తపనతోనే తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వస్తున్న సమయంలో సినీకార్మికుల పక్షాన నిలచి ముందు వారికి నివాసస్థలాలు ఇవ్వాలని పట్టు బట్టి మరీ ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఆయన కృషి ఫలితంగానే హైదరాబాద్ లో నేడు అతి ఖరీదైన ప్రాంతంగా నెలకొన్న మణికొండలో సినీకార్మికుల గృహసముదాయం వెలసింది. దానికి ‘డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురి’ అని నామకరణం చేశారు.
మందడి ప్రభాకర్ రెడ్డి 1935 జూన్ 1న సూర్యాపేట సమీపంలోని తుంగతుర్తిలో జన్మించారు. హైదరాబాద్ సిటీ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదివిన ప్రభాకర్ రెడ్డి ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో సీటు సంపాదించారు. 1955 నుండి 1960 వరకు ఎమ్.బి.బి.యస్. చదివారు. చదువుకొనే రోజుల నుంచీ నటనాభిలాష ఉండేది. వీలయినప్పుడల్లా నాటకాలు వేస్తూ వచ్చారు. ఆ అభిలాషతోనే చిత్రసీమలో నటునిగా ప్రయత్నాలు మొదలెట్టారు. గుత్తా రామినీడు తెరకెక్కించిన ‘చివరికి మిగిలేది’ చిత్రంలో సైకియాట్రిస్ట్ గా నటించి ఆకట్టుకున్నారు. ఆ రోజుల్లో డాక్టర్ చదివి నటనలోకి అడుగుపెట్టేవారికి ఎంతో గౌరవం ఉండేది. దాంతో ప్రభాకర్ రెడ్డిని చిత్రసీమ ఎంతో గౌరవించింది. నాటి మేటి నటులు యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ తమ చిత్రాలలో ప్రభాకర్ రెడ్డికి తగిన పాత్రలు ఇస్తూ వచ్చారు. తరువాతి రోజుల్లో విలన్ గానూ మెప్పించారు ప్రభాకర్ రెడ్డి.
డాక్టర్ గిరి చదివినా, ఎంతో వినయవిధేయతలతో ప్రభాకర్ రెడ్డి మసలుకొనేవారు. అందువల్ల యన్టీఆర్ కు ప్రభాకర్ రెడ్డి అంటే ప్రత్యేకమైన గౌరవం ఉండేది. తమ సొంత చిత్రాలలో ప్రభాకర్ రెడ్డికి ఎప్పుడూ తగిన స్థానం కల్పించేవారు రామారావు. అలా “ఉమ్మడి కుటుంబం, తల్లాపెళ్ళామా, దానవీరశూర కర్ణ, చాణక్య – చంద్రగుప్త, శ్రీమద్విరాట పర్వము” వంటి చిత్రాలలో ప్రభాకర్ రెడ్డితో కీలక పాత్రలు ధరింప చేశారు యన్టీఆర్. తన చిత్రాలకు యన్టీఆర్ కొన్నిసార్లు సొంతగా కథలు రాసుకొనేవారు. ‘ఉమ్మడి కుటుంబం’ చిత్రానికి యన్టీఆరే కథకుడు. ఆ చిత్రంలో ప్రభాకర్ రెడ్డి ఆయనకు మూడో అన్నగా నటించారు. నలుగురు అన్నదమ్ముల చుట్టూ సాగే కథ ఇది. దీనికి అచ్చుగుద్దినట్టుగా ఉండే కథతో ‘పండంటి కాపురం’ కథ తయారు చేశారు ప్రభాకర్ రెడ్డి. కృష్ణతో కలసి ప్రభాకర్ రెడ్డి తమ జయప్రద పిక్చర్స్ పతాకంపై ‘పండంటి కాపురం’ తెరకెక్కించారు. ఆ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. ప్రభాకర్ రెడ్డి కథలతో తెరకెక్కిన “గాంధీ పుట్టిన దేశం, కార్తిక దీపం, ధర్మాత్ముడు, గృహప్రవేశం” వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి.
ప్రతినాయకునిగా, గుణచిత్ర నటునిగా కీలక పాత్రలు పోషిస్తూ సాగిన ప్రభాకర్ రెడ్డికి ‘యువతరం కదిలింది’, ‘పల్లె పిలిచింది’ చిత్రాల ద్వారా రెండు సార్లు ఉత్తమ నటునిగా నంది అవార్డులు అందుకున్నారు. ‘గృహప్రవేశం’ చిత్రానికి సెకండ్ బెస్ట్ స్టోరీ రైటర్ అవార్డు దక్కింది. ‘చిన్నకోడలు’ సినిమా ద్వారా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గానూ నందిని అందుకున్నారు. లలితా రాణి అనే అమ్మాయిని తమ బ్యానర్ పేరుతో ‘జయప్రద’గా మార్చి ‘భూమికోసం’ చిత్రం ద్వారా పరిచయం చేసిందీ ప్రభాకర్ రెడ్డియే. ఆయనకు ఏసుదాస్ గానమంటే ఎంతో ఇష్టం. అందువల్ల తాను కథలు సమకూర్చిన చిత్రాలలో ఏదో విధంగా ఏసుదాస్ పాట ఉండేలా చూసేవారు ప్రభాకర్ రెడ్డి. కేవలం నటునిగానే కాకుండా కథకునిగా, నిర్మాతగా, దర్శకునిగా ప్రభాకర్ రెడ్డి తనదైన బాణీ పలికించారు. హైదరాబాద్ మకాం మార్చిన తరువాత నుంచీ ప్రభాకర్ రెడ్డి సినీ కార్మికుల పక్షాన నిలచి వారికి చేతనైన సాయం అందించే ప్రయత్నం చేసేవారు. 1997 నవంబర్ 25న ప్రభాకర్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. ఈ నాటికీ సినీకార్మికుల మదిలో నిలచే ఉన్నారు ప్రభాకర్ రెడ్డి.
తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలి!
‘డాక్టర్ ఎమ్.ప్రభాకర రెడ్డి’ పేరిట వెలసిన చిత్రపురిలో ఆయనకు ఘననివాళిగా ప్రభాకర్ రెడ్డి పేరిట ఓ ఆసుపత్రి నెలకొల్పాలని ఆయన కుటుంబ సభ్యులు భావించారు. ఎందుకంటే, నటన కంటే ముందు ప్రభాకర్ రెడ్డి వైద్యులు. పైగా, ఆ చిత్రపురి ఏర్పాటుకోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఈ విషయమై ప్రభుత్వానికి, చిత్రపురి కాలనీ కమిటీకి ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు వినతి పత్రం కూడా అందజేశారు. మరి ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఈ ప్రాంతానికి చెందిన ప్రభాకర్ రెడ్డి సినీకార్మికుల కోసం పాటు పడిన వైనాన్ని గౌరవిస్తూ, వారి కుటుంబ సభ్యులు కోరిన విధంగానే స్పందిస్తుందో లేదో చూద్దాం.