టాలీవుడ్‌లో దివంగత నటుడు శ్రీహరి పేరు ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకుంది. తెరపై ఎంత కఠినమైన పాత్ర పోషించినా, నిజ జీవితంలో మాత్రం ఆయన హృదయం పసిపాప లాంటిది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే, వారికి సహాయం చేయకుండా ఊరుకునే వారు కాదు. ఆర్థికంగా గానీ, మాటతో గానీ ఆయన ఇచ్చిన అండ ఎన్నో మందికి మళ్లీ బ్రతికే ధైర్యాన్ని ఇచ్చింది. కానీ ఇంత మంచి మనసున్న వ్యక్తి సంపాదించిన ఆస్తులను సొంతవాళ్లే మోసం చేయడం, ఆయన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయడం నిజంగా కలచివేస్తుంది.. అవును తాజాగా శ్రీహరి గారి భార్య, నటి డిస్కో శాంతి ఒక ఇంటర్వ్యూలో తమ జీవితంలోని చేదు అనుభవాలను పంచుకున్నారు. ఆమె మాటల్లో..
Also Read : Nara Rohit : నందమూరి క్యాంప్‌లో కొత్త వివాదానికి తేర లేపిన నారా రోహిత్ ..
“బావ (శ్రీహరి) రాత్రి ఎంత ఆలస్యంగా ఇంటికొచ్చినా, ఉదయం 7 గంటలకు షూటింగ్ ఉన్నా కూడా, ముందు రోజు రాత్రంతా ఎవరి సమస్యలైనా విని, పరిష్కారం చూపడానికి ప్రయత్నించేవారు. ఆయన ఇచ్చేది డబ్బు మాత్రమే కాదు, ఒక భరోసా. నేను కూడా ఆయన ప్రయత్నాని ఎప్పుడూ ఆపలేదు. ఎందుకంటే ఆయన చేసే పని మంచిదే. మనం మంచి చేస్తే దేవుడు కూడా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడని నమ్ముతాను” అని శాంతి చెప్పారు. అలాగే శ్రీహరి సంపాదించిన ఆస్తుల గురించి శాంతి మరో విషాదకరమైన నిజాన్ని బయటపెట్టారు..
“సినిమాల్లో ఆయన చాలా బాగా సంపాదించారు. కానీ వాటిని సగం అవసరాలకు వాడుకున్నాం, మిగతావన్నీ దానం చేసేశాం. అయితే మిగిలిన ఆస్తులు మాత్రం మా దగ్గరవాళ్లే మోసం చేసి మాకు లేకుండా చేశారు. ఎవరి పాపాన వాళ్లే అనుకున్నాం. కానీ ఆ సమయంలో పరిస్థితి చాలా కష్టంగా మారింది. ఆయన చనిపోయాక నాకు ఏమి చేయాలో తెలియని స్థితిలో .. మాకు ఆస్తుల విలువ తెలీదని తెలిసి కొందరు చాలా తక్కువ ధరకే మా వాటిని తీసుకున్నారు. అప్పుడు కొన్ని రోజులు తిండికీ కూడా కష్టమయ్యింది. బంగారం తాకట్టు పెట్టి గడిపిన రోజులున్నాయి. చూసే వారు మేము చాలా ఆస్తులు కూడబెట్టుకున్నామని అనుకున్నారు. కానీ నిజానికి ఎక్కువ భాగం దానాలకే వెళ్ళిపోయింది. అంతే కాకుండా, మాకు ఇవ్వాల్సిన వారు కూడా తిరిగి ఇవ్వలేదు. అందుకే పరిస్థితి మరింత క్లిష్టమైంది’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.