స్టార్ డైరెక్టర్ మారుతీ ఇంట విషాదం నెలకొంది. టాలీవుడ్ లో గత మూడు రోజులుగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏప్రిల్ 19న ప్రముఖ నిర్మాత నారాయణ దాస్ నారంగ్ కన్నుమూయగా, ఏప్రిల్ 20న అలనాటి దర్శకుడు టి రామారావు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా దర్శకుడు మారుతికి పితృవియోగం కలిగింది. తక్కువ బడ్జెట్ తో బ్లాక్ బస్టర్ సినిమాలు తీయడంలో పేరుగాంచిన దర్శకుడు మారుతి గురువారం తెల్లవారుజామున తన తండ్రి ఇక లేరన్న విషయాన్ని తెలుసుకున్నారు.
Read Also : Akshay Kumar : పాన్ మసాలా యాడ్ సెగ… సారీ చెప్పి తప్పుకున్న హీరో
స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో మారుతీ తండ్రి దాసరి వన కుచలరావును కన్నుమూశారు. ఆయన వయస్సు 76. కుచలరావు చాలా కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. తాజాగా ఆ అనారోగ్య సమస్యలతోనే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తండ్రి ఆకస్మిక మరణం మారుతీతో పాటు ఆయన కుటుంబాన్ని శోకంలో ముంచెత్తింది. మారుతి స్వగ్రామంలోనే ఈరోజు సాయంత్రం తండ్రి అంతక్రియలు జరగనున్నాయి. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు మారుతీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.