మనిషి తినే మెతుకు మీద పేరు రాసి ఉంటుందంటారు. అలాగే ఏ సినిమా ఎవరికి దక్కుతుందో… హిట్ సినిమా ఖాతాలో పడుతుందన్నది కూడా అంతే. అలా అనుకోకుండా హిట్ కొట్టిన హీరోలు ఉన్నట్లే దరికి వచ్చిన హిట్ సినిమాలను కాలదన్నుకున్న హీరోలు కూడా ఉంటుంటారు. దానికి టాలీవుడ్ చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా ‘సీతారామం’ విషయంలోనూ ఇలాగే జరిగింది. నిజానికి మొదటగా ఈ సినిమా కథను విజయ్ దేవరకొండకు వినిపించాడట దర్శకుడు హను రాఘవపూడి. అయితే విజయ్ ఈ స్క్రిప్ట్ కు కనెక్ట్ కాలేక పోయాడట. అంతే కాదు ఆ తర్వాత కూడా మరి కొందరు హీరోలు వెతుక్కుంటూ వచ్చిన ఈ హిట్ సినిమాను కాలదన్నుకున్నారట. వారెవరో చూద్దాం.
అనధికారంగా వినిపిస్తున్న సమాచారాన్ని హను ముందుగా నానికి చెప్పిన కథ ఇదట. అయితే ‘పడి పడి లేచే మనసు’ సినిమా పరాజయం పాలు కావటంతో అప్పటికే ఫ్లాప్స్ లో ఉన్న నేచురల్ స్టార్ సున్నితంగా ఆ ఆఫర్‌ని తిరస్కరించాడట. ఇక ఆ తర్వాత దర్శకుడు హీరో రామ్ పోతినేనిని సంప్రదించించాడట. అయితే మాస్ మేనియాలో పడి కొట్టుకుపోతున్న రామ్ సినిమాలో చిందేసే పాటలు, కమర్షియల్ హంగులు లేవనే ఆలోచనతో నో అన్నాడట. అలా అలా చివరకు ‘సీతారామం’ స్క్రిప్ట్ దుల్కర్ చెంతకు చేరింది. భిన్నమైన కథా చిత్రాలను ఇష్టపడే దుల్కర్ యస్ అనటం… సినిమా రిలీజ్ తర్వాత తను పోషించిన లెఫ్టినెంట్ రామ్ పాత్రకు ను పోషించినందుకు ప్రశంసలు అందుకోవడం జరిగిపోయింది. నో చెప్పిన విజయ్ ప్యాన్ ఇండియా మూవీ ‘లైగర్’ని నమ్ముకుని వెళుతుంటే… నాని, రామ్ తమ పరాజయాల పరంపరను కొనసాగిస్తున్నారు. దేనికైనా రాసి పెట్టి ఉండాలంటారు. మీరేమంటారు!?