Sekhar Kammula: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా నారాయణదాస్ నారంగ్ ఉన్న సమయంలో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమాను ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలంతా ధనుష్ ను చెన్నయ్ వెళ్ళి స్వయంగా కలిసి, మాట్లాడారు. అయితే… ఆ తర్వాత నారాయణ దాస్ అనారోగ్యంగో కన్నుమూశారు. ఇతర కారణాలతోనూ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేకపోయింది. ఈ లోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ధనుష్ – వెంకీ అట్లూరితో ‘సార్’ మూవీని మొదలు పెట్టింది. ఇది వచ్చే యేడాది ఫిబ్రవరిలో విడుదల చేయబోతోంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ధనుష్ – శేఖర్ కమ్ముల సినిమా సెట్స్ పైకి వెళ్ళడం విశేషం. సోమవారం ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి. హీరో ధనుష్ కూడా ఇందులో పాల్గొన్నాడు. ఈ మూవీని సునీల్ నారంగ్, పుస్కర్ రామ్మోహన్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించబోతున్నారు. శేఖర్ కమ్ముల సైతం నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తారు. గతంలోనూ వీరి కాంబినేషన్ లోనే నాగ చైతన్య హీరోగా ‘లవ్ స్టోరీ’ మూవీ వచ్చింది. ఈ తాజాచిత్రానికి సోనాలి నారంగ్ సమర్పకురాలిగా వ్యవహరిస్తారు. త్వరలోనే మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని నిర్మాతలు తెలిపారు.