భావకవులు ఎవరికీ అర్థం కాని పాటలు రాసుకొని తమ ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారని కొందరి విమర్శ. అయితే ఊహాలోకంలో విహరించమనే ఐన్ స్టీన్ వంటి మేధావులు సైతం సెలవిచ్చారు. నేటి ఊహ, రేపటి వాస్తవం కావచ్చునని శాస్త్రజ్ఞులు కూడా అంగీకరిస్తున్నారు. తెలుగునేలపై భావకవితకు పట్టం కట్టి ఊరూరా, వాడవాడలా పలువురు యువకవులను ఊహాలోకాల్లో విహరింప చేసిన ఘనుడు దేవులపల్లి వేంకటకృష్ణ శాస్త్రి. ఆయన భావకవితకు జేజేలు పలికారు జనం. వాస్తవికతకు దూరంగా ఉండే భావుకత ఎంతవరకు సమంజసం అంటూ గళమెత్తినవారూ లేకపోలేదు. ఎవరి భావాలు వారివి. కృష్ణశాస్త్రిలోని భావకవిత్వమే ఆ రోజుల్లో పట్టాభిషేకాలు చేసుకుంది. దిగ్దర్శకుడు బి..యన్.రెడ్డిని కూడా కృష్ణశాస్త్రి భావుకత ఆకర్షించింది. తన 'మల్లీశ్వరి'కి తగ్గ రచయిత అని బి.యన్.రెడ్డి భావించి, కృష్ణశాస్త్రి పాటను చిత్రసీమకు పరిచయం చేశారు. అక్కడా కృష్ణశాస్త్రి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. 'ఆకాశవీధిలో హాయిగా ఎగిరే మేఘమాలలతో సందేశాలు' పంపించారు. 'మనసున మల్లెల మాలలు ఊగించారు', ఆ సువాసనలు తెలుగు ప్రేక్షకులను కట్టి పడేశాయి. కృష్ణశాస్త్రి పాటతో పయనించడంలో ఎంతోమంది హాయిని పొందారు. కొందరు హాయి కోసమే కృష్ణశాస్త్రి పాటలతో సాగారు.
అవకాశాలు లభించాయి కదా అని కృష్ణశాస్త్రి పరుగులు తీస్తూ పాటలు రాయలేదు. ఉరకలు వేస్తూ భావుకత పలికించలేదు. సందర్భశుద్ధితోనే ఆయన పాట సాగేది. తరువాతి రోజుల్లో ఆయన పాటకు సినిమాజనం దూరంగా జరిగినప్పుడు కూడా ఏ రోజూ రాజీపడింది లేదు. ఓంకారనాదాను సంధానంతో “ఘనాఘన సుందరుని” కీర్తిస్తూ భక్త తుకారాం నోట పల్లవించిన కృష్ణశాస్త్రి పాట ఏదో ఓ చోట నేటికీ మారుమోగుతూనే ఉంది. ‘అమెరికా అమ్మాయి’కి ఒళ్ళంత వయ్యారి కోక చుట్టి, ఆమెనోట తెలుగు పాట పలికించి పులకింప చేసిన తీరును ఎవరు మాత్రం మరువగలరు? “మావిచిగురు తినగానే కోకిల పలుకుతుందని” అందరికీ తెలుసు, ఆ సత్యాన్ని మరోమారు గుర్తు చేస్తూనే మధురాన్ని మన సొంతం చేశారాయన. ప్రకృతి సౌందర్యంతోనే కృష్ణశాస్త్రి కలం సాగింది.. ‘గోరింట కొమ్మలేకుండా పూచింది…’ అంటూనే మందారంలా పూస్తే మంచిమొగుడొస్తాడు అంటూ కన్నెల మనసుల్లో ఆశలు రేపింది.
‘ఆరనీకుమా ఈ దీపం…” అంటూ ప్రతీ కార్తిక మాసంలో తెలుగునేలపై మహిళలు పాడుకొనేలా ఓ పాటనూ ప్రసాదించింది కృష్ణశాస్త్రి కలం. ‘మేఘసందేశాలు’ పంపడంలో మేటి అనిపించుకున్న కృష్ణశాస్త్రి పలికించిన “ఆకులో ఆకునై… పువ్వులో పువ్వునై…” గేయాన్ని అదేపనిగా సినిమా పాటగా మార్చుకున్న వైనాన్నీ మరువలేం. “జయ జయ ప్రియభారత జనయిత్రీ…దివ్యధాత్రి…” అంటూ కృష్ణశాస్త్రి పలికించిన దేశభక్తి గీతం సైతం అందరినీ అలరించింది… ఆ పాటకు ఇళయరాజా తనవైన బాణీలు కట్టి మరీ మురిపించారు… ఇలా కృష్ణశాస్త్రి పాటతో సాగుతూ ఉంటే మనలోనూ భావకవిత్వం పాటందుకోకమానదు. అదీ కృష్ణశాస్త్రి సాధించిన ఘనకీర్తి. ఆ కీర్తి వెలుగుల్లోనే ఇప్పటికీ ఎందరో భావకవులు భావకవిత్వ సాధన చేస్తున్నారు.