రీసెంట్ గా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును అందుకున్న కంగనా రనౌత్ అప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా కంగనా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మామూలుగానే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన కంగనా రనౌత్ మరో వివాదంలో చిక్కుకుంది. 1947లో భారత్‌కు స్వాతంత్య్రం రాలేదని, బ్రిటీష్ వారు భిక్ష వేశారని, మనకు 2014లోనే మోదీ అధికారంలోకి వచ్చాక అసలైన స్వతంత్రం లభించిందని వ్యాఖ్యానించింది. 1947లో మనకు వచ్చింది స్వతంత్రం కాదని… భిక్ష అంటూ ఓ టీవీ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది కంగనా. కంగనా కామెంట్స్‌పై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు భగ్గుమన్నాయి. దేశ ప్రతిష్టను దిగజార్చేలా కంగనా మాట్లాడిందంటూ… ముంబై పోలీసులకు ఆప్ నేత ప్రీతి మీనన్ ఫిర్యాదు చేశారు. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కోరారు. 504, 505 మరియు 124A సెక్షన్‌ల కింద విద్రోహ, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న కంగనా రనౌత్ పై చర్య తీసుకోవాలని అభ్యర్థిస్తూ ముంబై పోలీసులకు దరఖాస్తును సమర్పించినట్లు ప్రీతీ మీనన్ ట్వీట్ చేసింది.
Read Also : ‘జై భీమ్’ కాంట్రవర్సీ… మాజీ మంత్రి ఆరోపణలపై సూర్య రియాక్షన్
కంగనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ. అంతేకాదు… ఆమె విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలన్నారు. ఒక వేళ కంగనా వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నట్టయితే… ఆ విషయాన్ని ప్రధాని చెప్పాలన్నారు. లేదంటే కంగనాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆనంద్ శర్మ. మొత్తానికి నరేంద్ర మోడీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పబోయి అడ్డంగా బుక్కైపోయింది కంగనా. BJPని పొగిడే క్రమంలో దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వాళ్లను కంగన అవమానించడం తగదంటున్నాయి విపక్షాలు.