Cobra: ఒక సినిమాను ప్రేక్షకుడు ఒకలా చూస్తాడు.. డైరెక్టర్ ఒకలా చూస్తాడు. ప్రేక్షకుడు ఎలా ఆలోచిస్తాడో డైరెక్టర్ కూడా అలా ఆలోచించినప్పుడే సినిమాలు హిట్ అవుతాయి. ఇక డైరెక్ట పాయింట్ ఆఫ్ వ్యూలో బావున్నా సినిమా ప్రేక్షకుల మైండ్ కు ఎక్కదు. తెలుగులో అలాంటి సినిమా ఉదాహరణకు చెప్పాలంటే వన్ నేనొక్కడినే. ఈ సినిమా అప్పట్ల ఎవరికి అర్ధం కాలేదని ఎంతోమంది చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆ సినిమా కల్ట్ క్లాసిక్ అని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ఒక డైరెక్టర్ తన సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే వారిని సారీ అడగడం చాలా అరుదుగా జరుగుతోంది. ఈ అరుదైన ఘటన కోలీవుడ్ లో జరిగింది. విక్రమ్, శ్రీనిధి శెట్టి జంటగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన కోబ్రా ఇటీవలే రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకొన్న విషయం విదితమే.
సినిమా ల్యాగ్ ఉందని, కథలో మొత్తం కన్ప్యూజ్ నే ఉందని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను 20 నిముషాలు ట్రిమ్ చేసినా ఫలితం లేదని కూడా చెప్పుకొచ్చారు. ఇక తాజాగా సోషల్ మీడియా లైవ్ లో అభిమానులతో ముచ్చటించిన అజయ్ జ్ఞానముత్తు వద్ద అభిమానులు ఇదే విషయాన్నీ చెప్పుకురావడంతో ఆయన అభిమానులను క్షమాపణలు అడిగాడు. “సినిమా కన్ప్యూజ్ చేసి, మీకు అర్ధం కాకుండా చేసి ఉంటే నన్ను క్షమించండి. నేను ఒక ప్రేక్షకుడిగా ఆలోచించి మెదడుకు పదును పెట్టే సినిమాలు ఎక్కువగా చూస్తాను. అందుకే ఇలాంటి కథను ఎంచుకున్నాను. వీలైతే ఈ సినిమాను రెండోసారి చూడండి. సినిమా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అజయ్ క్షమాపణలు నెట్టింట వైరల్ గా మారాయి.