Will Smith: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘రాకా’. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాల్లోనూ జోరుగా చక్కర్లు కొడుతోంది. హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్‌ను ‘రాకా’లో కీలక పాత్ర కోసం మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. ఈ చిత్రంలో విల్ స్మిత్‌ను విలన్ పాత్రలో నటింపజేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆయన ఓకే చెబితే.. ఇండియన్ సినిమా, హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడి కలయికగా ‘రాకా’ మరింత ప్రత్యేకంగా మారనుంది.
విల్ స్మిత్ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ఓవర్సీస్‌లో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే షూటింగ్ జరగనున్న లొకేషన్ ఇంకా ఖరారు కాలేదని, ఆయన డేట్స్‌కు అనుగుణంగా ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం విల్ స్మిత్ డేట్స్‌పై చర్చలు జరుగుతున్నాయని, ఆయన పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ఇప్పటికే ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. సెప్టెంబర్ తర్వాత ‘రాకా’ ఓవర్సీస్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విల్ స్మిత్ ఈ ప్రాజెక్టులో భాగమయ్యే అవకాశంపై చిత్రబృందం కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విల్ స్మిత్ ‘రాకా’లో నటించనున్నారనే విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ కాంబినేషన్ ఖరారైతే.. అల్లు అర్జున్, అట్లీ సినిమాకు ఇది ఓవర్సీస్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది.

