కరోనాతో ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ ముఖ చిత్రమే మారిపోయింది. కరోనా తొలి వేవ్ లోనే థియేటర్లు లేక ఓటీటీల వైపు మొగ్గుచూపారు ప్రేక్షకులు. దాంతో పలువురు దర్శకనిర్మాతలు తమ చిత్రాలను డైరెక్ట్ గా ఓటీటీలలో విడుదల చేయటానికి సిద్ధమై పోయారు. వాటిలో కొన్నింటికి ఆదరణ దక్కినా మెజారిటీ సినిమాలకు మాత్రం చుక్కెదురైంది. ఇక కొన్ని సినిమాలు పే ఫర్ వ్యూ పద్ధతితో ఆడియన్స్ ముందుకు వచ్చాయి. అయితే స్టార్ హీరోల సినిమాలు ఏవీ అలా రిలీజ్ చేయటానికి ముందుకు రాలేదు. పరిస్థితి మారుతోంది. ఒక్కొక్కరే పే ఫర్ వ్యూ మోడ్ కి సిద్ధం అవుతున్నారు. ఎందుకంటే థియేటర్స్ ఓపెన్ అయినా ఆడియన్స్ వస్తారో రారో అనే బెంగ ఉంది. అయితే కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత టాలీవుడ్ లో మాత్రం థియేటర్లకు జనాలు ఎగబడ్డారు. మునుపటి కంటే మార్కెట్ మెరుగయింది. దాంతో సినిమాల నిర్మాణం బాగా పెరిగింది. దానికి తగ్గట్లే నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరగింది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తో మళ్ళీ షూటింగ్ లు, థియేటర్లు బంద్ అయ్యాయి. తొలి వేవ్ లోనే తమిళంలో విజయ్ సేతుపతి పే ఫర్ వ్యూ లెక్కలో సినిమా విడుదల చేశారు. అయితే సినిమా బాగా లేకపోవడంతో వర్కవుట్ కాలేదు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘రాధే’ సినిమాను పే ఫర్ వ్యూ మోడ్ లో రిలీజ్ చేశారు. మొదటి రోజే అద్భుతమైన స్పందన వచ్చింది. టికెట్ రేట్ రూ. 249 పెట్టారు. టాక్ కి అతీతంగా భారీ వ్యూస్ నే రాబట్టింది.
మన స్టార్స్ ఓకె అంటారా…!?
మరి ఈ పే ఫర్ వ్యూ పద్ధతికి మన తెలుగు స్టార్స్ ఓ కె అంటారా!? అంటే నిస్సందేహంగా నో అనే సమాధానం వస్తుంది. అసలు సినిమా బడ్జెట్ కి మించి లాభం వస్తున్నా… ఓటీటీ రిలీజ్ కి నో అంటూ నిర్మాతలకు అడ్డుకట్ట వేస్తున్నారు మన హీరోలు. ఇందులో స్టార్ హీరోలే కాదు ఛోటా మోటా హీరోలు కూడా ఉండటం గమనార్హం. ఓటీటీ అంటే తమ ఇమేజ్ కి ఏదో భంగం వాటిల్లుతున్నట్లు ఫీలై పోతున్నారు. అసలు నిర్మాత పెట్టిన డబ్బుకి మించి లాభం వస్తుంటే ఎందుకు నో అంటున్నారో అర్థం కావటం లేదనే వారు లేకపోలేదు. ఓటీటీలో రిలీజ్ అయితే క్వాలీటీ తో పైరసీ వెంటనే వచ్చేస్తుంది. పైరసీని కంట్రోల్ చేయగలిగితే ఓటీటీ లో పే ఫర్ వ్యూ ద్వారా బాగానే వర్కవుట్ కావచ్చు అంటున్నారు. మన సినిమా మీద మనం నమ్మకం పెంచుకోవాలి. అంతే కాదు తాము ఓకె చేసిన కథలతో తయారైన సినిమాలకు రిలీజ్ తర్వాత వచ్చే ప్రాఫిట్ ను షేర్ చేసుకునే ధైర్యం, దమ్ము మన హీరోలకు ఉండాలి. అలా ఉన్నవారెవరూ కనిపించటం లేదు. అందుకేనేమో మా సినిమా థియేటర్లలోనే వస్తుంది. ఓటీటీలో రాదు అనే ప్రకటనలనే చూస్తున్నాం. మా సినిమాల రిలీజ్ ఎక్కడైనా ఒకటే… మీ ఆదరణ ఉంటే చాలు అనే నికార్సైన హీరోలెవరూ లేకుండా పోయారు. మరి అలా ధైర్యంగా ముందుకు వచ్చి మన హీరోలు ఎప్పుడు ప్రకటిస్తారో చూద్దాం.