2011లో ‘ప్యార్ కా పంచనామా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ ఆర్యన్ కెరీర్ గత రెండేళ్ళుగా ఊపందుకుంది. వరుస విజయాలతో ఈ మధుర కుర్రాడు క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. అయితే… గత కొన్ని నెలలుగా అతని చేజారుతున్న చిత్రాలను చూస్తుంటే… కార్తీక్ మరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గా మారిపోతాడా అనే సందేహం కొందరికి కలుగుతోంది. బాలీవుడ్ లోని నెపోటిజమ్ గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఆ మర్రిచెట్టు నీడలో ఎంత ప్రతిభ ఉన్నా కొత్తవారు ఎదగడం అనేది జరుగదు. అయితే… నూటికో కోటికో ఒక్కరన్నట్టుగా కొందరు మాత్రం అన్ని ఇబ్బందులను ఎదుర్కొని విజయపథంలో సాగుతారు. అలాంటి వారిని సైతం వెనక్కి లాగే శక్తులకూ బాలీవుడ్ లో కొదవలేదు. కార్తీక్ ఆర్యన్ విషయానికే వస్తే… ‘లుకా చుప్పీ’ మూవీ 100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిన తర్వాత చాలామంది దృష్టి అతనిపై పడింది. సినిమా అవకాశాలూ పెరిగాయి. జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ కు కార్తీక్ గట్టి పోటీ ఇస్తాడని కొందరు జోస్యం చెప్పారు. అదే బహుశా అతనికి శాపం అయ్యిందనుకుంటా! దానికి తోడు కరన్ జోహార్ ‘దోస్తానా -2’ మూవీ నుండి కార్తీక్ వాకౌట్ చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని పిస్తోంది. రెండు పెద్ద బానర్స్ నుండి కార్తీక్ ఆర్యన్ ను పక్కకు తప్పించారు. ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు, సెట్స్ పై ఉన్న మూవీస్ కొన్నేళ్ళ క్రితం అతను అంగీకరించినవే తప్పితే కొత్తవి కాదు. ఇక మీదట కొత్త అవకాశాలను కార్తీక్ ఆర్యన్ ఎంతవరకూ అదుకుంటాడనేది సందేహమే! మరి కొందరైతే ఓ అడుగు ముందుకేసి, బాలీవుడ్ లో మరో సుశాంత్ సింగ్ లా కార్తీక్ మారినా ఆశ్యర్యపోనవసరం లేదని అంటున్నారు. మరి ఈ వెన్నుపోటులను తట్టుకుని, అడ్డంకులను అధిగమించి కార్తీక్ ఎలా ముందడుగు వేస్తాడో చూడాలి.