సాయి పల్లవి గురించి పరిచయం అక్కర్లేదు. అందరు హీరోయిన్ లతో పోల్చుకుంటే ఆమె రూటే సెపరేట్. ఎలాంటి మేకప్ లేకుండా ఎంత పెద్ద షో అయిన.. సింపుల్ గా ఉంటుంది. ఇక రీసెంట్ గా ‘తండేల్’ మూవీతో భారీ విజయం తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తన అద్భుతమైన నటనతో మరోసారి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తనకు జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉందని తెలిపింది..
సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘ నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఓ చీర ఇచ్చింది. నా పెళ్లిలో దాని కట్టుకోమని చెప్పింది. అప్పటికి నేనింకా సినిమాల్లోకి రాలేదు.. కాబట్టి పెళ్లి చేసుకున్నప్పుడు దాన్ని కట్టుకుంటామని అనుకున్నాను.. కానీ ఆ తర్వాత మూడేళ్లకు సినిమాల్లోకి అడుగు పెట్టా.. నా మొదటి చిత్రం ‘ప్రేమమ్’ తో అనుకోకుండా మంచి గుర్తింపు సంపాదించుకున్నాను.. తొలి నాళ్లలో ఏదో ఒక రోజు తప్పకుండా ఒక ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకుంటానని నమ్మాను.. జాతీయ అవార్డు అంటే ఆ రోజుల్లో ఎంతో గొప్ప.. కాబట్టి, దానిని అందుకున్న రోజు ఈ చీర కట్టుకుని అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నా.. కానీ, దానిని అందుకున్నా, అందుకోకపోయినా.. ఈ చీర కట్టుకునేంత వరకు నాపై ఒత్తిడి ఉంటూనే ఉంటుంది’ అని సాయి పల్లవి తెలిపింది. ఇక, సాయి పల్లవి నటించిన ‘గార్గి’ సినిమాకు జాతీయ అవార్డు వరిస్తుందని అనుకున్నారు.. కానీ చివరకు నిరాశ ఎదురైంది.. అదే ఏడాది నిత్యామీనన్ కు నేషనల్ అవార్డు వరించింది. మరి సాయి పల్లవి కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.