తమిళులకు ప్రాంతీయాభిమానం, భాషాభిమానం ఎక్కువ. ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. ఆ మధ్య కాలంలో తమిళ చిత్రాల పేర్లు ఆ భాషలోనే ఉండేవి. ఆ సినిమాలను ఇటు తెలుగు, అటు హిందీలో అనువదించినప్పుడు ఇంగ్లీష్ పేర్లు పెట్టినా, తమిళంలో మాత్రం వారి భాషలోనే టైటిల్స్ పెట్టే వారు. దానికి ఉదాహరణగా రజనీకాంత్ ‘ఎంథిరన్’ మూవీనే. ఈ సినిమాకు తెలుగులో ‘రోబో’ అనే ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు. కానీ తమిళనాట మాత్రం భాషాభిమానం చూపారు. ఇలా కొన్నేళ్ల పాటు తమిళ చిత్రాలకు తమిళ పేర్లు మాత్రమే ఉండేవి. అయితే… దాని వెనుక ఓ కారణం ఉంది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సినిమాలకు పరభాష పేర్లను పెడితే రాయితీలలో కోత విధిస్తామని చెప్పింది. దాంతో స్వభాష మీద అభిమానం అనే సాకుతో, ఇష్టం ఉన్నా లేకపోయినా తమిళ పేర్లే నిర్మాతలు పెట్టారు. కానీ కొన్నేళ్ళ క్రితం ఆ క్లాజ్ ను స్టేట్ గవర్నమెంట్ తొలగించింది. దాంతో హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్న దర్శక నిర్మాతలు తమ కథకు తగ్గట్టు, ట్రెండ్ ను అనుసరించి, ఒక్కోసారి ఆంగ్లంలోనూ పేర్లు పెడుతున్నారు. అయితే… ఈ ధోరణి కాస్తంత అతి అయినప్పుడు మాత్రం తమిళ భాషాభిమానులు సినిమా వాళ్ళ మీద విరుచుకు పడుతున్నారు. ఇప్పుడు దళపతి విజయ్ విషయంలోనూ అదే జరుగుతోంది.
Read Also : జారిపోయిన వస్త్రాలతో… జాన్వీ టాప్ లెస్ పిక్!
స్టార్ హీరో విజయ్ వీలైనంతవరకూ తన చిత్రాలకు తమిళంలోనే పేర్లు పెడుతుంటాడు. కానీ ఆ మధ్య ఓ సినిమాకు ‘సర్కార్’ అని, ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన చిత్రానికి ‘మాస్టర్’ అని పేర్లు పెట్టాడు. అప్పుడు ఆ టైటిల్స్ మీద ఎలాంటి వ్యతిరేకత తమిళ భాషాభిమానులు వ్యక్తం చేయలేదు. అయితే ఇప్పుడు మరోసారి తన తాజా చిత్రానికి ‘బీస్ట్’ అనే ఇంగ్లీష్ పేరు పెట్టేసరికి కొందరికి మండుకొచ్చింది. విజయ్ లాంటి స్టార్… ఇలా తన సినిమాలకు ఆంగ్లంలో పేరు పెడితే, చిన్న హీరోలూ అదే పంథాలో సాగుతారని, ఇది సరైన పద్థతి కాదని కొన్ని రాజకీయ పార్టీలు విమర్శించడం మొదలెట్టాయి. మరి ‘బీస్ట్’ టైటిల్ విషయంలో చిత్ర బృందం పునరాలోచన చేస్తుందా… లేక ట్రెండ్ ఇదేనని ముందుకు పోతుందా అనేది వేచి చూడాలి.