విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ క్రమంలో తాజాగా మీడియాతో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సినిమా టికెట్ ధరల పెంపుపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ, సాధారణ ప్రేక్షకులకు అనుకూలంగా ఉండే ఒక కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. తన చిత్రాలకు టికెట్ రేట్లు పెంచడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని తెలిపారు. “నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో సినిమా టికెట్ రేట్లు పెరిగినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు ఇంకా గుర్తుంది. అందుకే నిర్మాతలు, దర్శకులతో మాట్లాడి నా సినిమాలకు టికెట్ ధరల పెంపు లేకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. సినిమా అనేది ఎక్కువ మంది ప్రజలకు చేరువ కావాలి. టికెట్ రేట్లు సామాన్యులకు అందుబాటులో ఉన్నప్పుడే థియేటర్లకు ఎక్కువ మంది ప్రేక్షకులు వస్తారు. తక్కువ మందితో ఎక్కువ డబ్బులు రాబట్టడం కంటే, కోట్ల మంది థియేటర్లలో సినిమాను వీక్షించడమే నాకు ముఖ్యం” అని విజయ్ చెప్పారు.

