సినిమాలలో సాంకేతికత పెరిగేకొద్దీ దర్శకులకు అద్భుతాలు సృష్టించే అవకాశం దొరుకుతోంది. కానీ అక్కడే VFX సరిగ్గా కుదరకపోతే సినిమా ఫలితం తలకిందులవుతుందని టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అనేక ఉదాహరణలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. కేవలం గ్రాఫిక్స్‌ను నమ్ముకుని కథను పక్కనపెట్టినా, లేదా నాసిరకం విజువల్స్‌తో ప్రేక్షకులను మభ్యపెట్టాలని చూసినా సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గురై మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒకప్పుడు సినిమా అంటే నటన, కథ, మాటలు అనేవారు కానీ ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ అనేవి సినిమాకు వెన్నెముకగా మారాయి. నిజానికి మోహన్ లాల్ నటించిన ‘వృషభ’ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. కానీ, ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ప్రధాన విమర్శ CG వర్క్ గురించే. సుమారు 70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, కనీసం 2 కోట్ల వసూళ్లను కూడా సాధించలేకపోయిందంటే దానికి ప్రధాన కారణం సినిమాలోని నాసిరకం గ్రాఫిక్స్, బలహీనమైన కథనమే. అలాగే పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ విషయంలో కూడా గ్రాఫిక్స్ పనుల వల్లే తీవ్ర జాప్యం జరిగింది. ప్రారంభంలో వచ్చిన విజువల్స్ పట్ల ఫ్యాన్స్ పెదవి విరవడంతో, మేకర్స్ మళ్లీ జాగ్రత్త పడాల్సి వచ్చింది. అంత చేసీ సరైన సమయంలో నాణ్యమైన విజువల్స్ ప్లాన్ చేయకపోవడం సినిమా ఫలితాన్ని ప్రభావితం చేస్తుందని ఈ ఉదాహరణలు చెబుతున్నాయి.
Also Read :Dutt Sisters: క్యాషియర్లు కాదు.. క్రియేటర్లు.. ‘ ఛాంపియన్’ సిస్టర్స్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ టీజర్ విడుదలైనప్పుడు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన రావడం, గ్రాఫిక్స్ పిల్లల సినిమా తరహాలో ఉన్నాయంటూ ట్రోల్స్ వచ్చాయి. అయితే, మేకర్స్ వెంటనే అలర్ట్ అయ్యి రెండో టీజర్‌లో విజువల్స్‌ను గ్రాండ్‌గా తీర్చిదిద్ది అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇలా తప్పులను దిద్దుకుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సినిమా నితీష్ తివారీ ‘రామాయణ’, రెండు భాగాలకు కలిపి దాదాపు 4 వేల కోట్ల బడ్జెట్ అని టాక్ నడుస్తోంది. అయితే, నెటిజన్లు ఒకే ఒక సందేహం వ్యక్తం చేస్తున్నారు. అదేమంటే ఈ సినిమా కూడా ‘ఆదిపురుష్’ లాగే కార్టూన్ సినిమాలా మారుతుందా? అని. ఓవర్ టెక్నాలజీని నమ్ముకుని ఒరిజినాలిటీని వదిలేస్తున్నారా? పౌరాణిక గాథను తీస్తున్నారా లేక గ్రాఫిక్స్ మాయాజాలాన్ని చూపిస్తున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ అనేవి కథకు ఆభరణంలా ఉండాలి తప్ప, అవే సినిమాగా మారి ప్రేక్షకులకు విసుగు తెప్పించకూడదనేది విశ్లేషకులు చెప్పే మాట. అలా టెక్నాలజీని ఎంత వాడామన్నది కాదు.. ఎంత ఎఫెక్టివ్‌గా వాడామన్నదే కీలకం. నెటిజెన్ల నుంచి’దబిడిదిబిడే’ అనిపించుకోకుండా ఉండాలంటే దర్శకులు గ్రాఫిక్స్ వెనుక కాకుండా, కథకు తగ్గ విజువల్స్ వెనుక పరిగెత్తాల్సిన అవసరం ఉంది.