వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తాజాగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. కమల్ కామరాజు తదితరులు నటిస్తున్న ‘మహేంద్రగిరి వారాహి’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన నిర్మాత లక్ష్మణ్, అలాగే సీనియర్ హీరో సుమంత్ గురించి చేసిన ఆసక్తికర కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిర్మాత లక్ష్మణ్ గురించి వెంకీ మాట్లాడుతూ.. “లక్ష్మణ్ సార్ ఎక్కడుంటే అక్కడ డబ్బు ఉంటుంది. ఆయనకు ఒక ‘మిదాస్ టచ్’ ఉంది. ఏ సినిమా కొన్నా, ఎక్కడ కొలాబరేట్ అయినా అక్కడ కాసుల వర్షం కురవాల్సిందే. ఆ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. ఆయనకున్న జడ్జిమెంట్ అలాంటిది” అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలతో లక్ష్మణ్ సార్ గోల్డెన్ హ్యాండ్ పై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది.
ఇక సినీ పరిశ్రమలో అత్యంత జెన్యూన్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది హీరో సుమంత్ అన్నే అని వెంకీ అట్లూరి కుండబద్దలు కొట్టారు. తాను ఏ కొత్త కథ రాసినా ముందుగా సుమంత్ దగ్గరికే తీసుకెళ్తానని, ఆయన సినిమాలను ఎంచుకునే విధానం వేరే లెవెల్ అని ప్రశంసించారు. ఒక సినిమా బాగుంటుంది అని సుమంత్ అన్నకు గురి కుదిరితే, అది పక్కా హిట్ అని ఆయన చెప్పుకొచ్చారు. ‘మహేంద్రగిరి వారాహి’ విషయంలో సుమంత్ నమ్మకం ఉంచారు కాబట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని వెంకీ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రేక్షకులు మొదటి వారాంతానికే పరిమితం కాకుండా, మూడో వారం, నాలుగో వారం కూడా థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తుండటం ఇండస్ట్రీకి శుభపరిణామం అని వెంకీ అన్నారు. మన కల్చర్ ను చాటిచెప్పే ‘మహేంద్రగిరి వారాహి’ లాంటి సినిమాలను కేవలం చూడటమే కాకుండా, అందులోంచి నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కమల్ కామరాజు, సుమంత్ కాంబోలో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘గోదావరి’ కంటే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించారు. మొత్తానికి తన స్పీచ్ తో వెంకీ అట్లూరి ఈ చిత్రంపై ఒక్కసారిగా భారీ హైప్ క్రియేట్ చేశారు.

