Venky Atluri: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తర్వాత ఆ స్టార్ హీరోతో వెంకీ అట్లూరి సినిమా!

Dhanush

Dhanush

Venky Atluri: టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్య హీరోగా తెరకెక్కిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే చిత్రంపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. తమిళ స్టార్ హీరో ధనుష్‌తో మరోసారి కలిసి పని చేయనున్నట్లు వెల్లడించారు. వెంకీ అట్లూరి ఇప్పటికే ధనుష్‌కి ఒక స్టోరీ లైన్ వినిపించినట్లు చెప్పారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ కథనే పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

తన కొత్త సినిమా పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్టోరీగా ఉండబోతుందని వెంకీ అట్లూరి వెల్లడించారు. ఈ కథలో యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలు, కమర్షియల్ అంశాలకు కూడా ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన ఆయన, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదల అనంతరం ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెంకీ అట్లూరి – ధనుష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సార్’ (తమిళంలో ‘వాతి’) చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత ఈ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో రెండోసారి వీరిద్దరూ కలిసి సినిమా చేయనున్నారనే వార్త బయటికి రావడంతో ధనుష్ అభిమానుల్లో ఈ కొత్త చిత్రంపై ఆసక్తి పెరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పూర్తైన తర్వాతే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు.