Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్‌ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!

Telangana Film Chamber

Telangana Film Chamber

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెం. 77పై తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. సినిమా థియేటర్ల వర్గీకరణ, టికెట్ ధరల ఖరారుకు సంబంధించి జారీ చేసిన ఈ ఉత్తర్వులను మరోసారి సమగ్రంగా సమీక్షించాలని కోరుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిల్మ్ ఛాంబర్ లేఖ రాయడంతో పాటు అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ జీవో అమలు వల్ల తలెత్తే పరిణామాలపై స్పష్టతనిస్తూ, ఎలాంటి తుది నిర్ణయాలు లేదా మార్పులు చేసే ముందైనా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అన్ని ప్రధాన భాగస్వాములతో (స్టేక్‌హోల్డర్స్) విస్తృతంగా చర్చించాలని ఫిల్మ్ ఛాంబర్ గౌరవ కార్యదర్శి వి.ఎల్. శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లతో పాటు నిర్మాతలు, పంపిణీదారులు (డిస్ట్రిబ్యూటర్లు), ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.

కొత్త జీవోలో చేర్చిన “స్పెషల్ థియేటర్” కేటగిరీ, వాటికి విధించిన నిబంధనలు మరియు సవరించిన ధరల నిర్మాణం వల్ల క్షేత్రస్థాయిలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఛాంబర్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని సింగిల్ స్క్రీన్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించాలని కోరింది. పరిశ్రమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, సింగిల్ స్క్రీన్ల మనుగడను కాపాడే దిశగా ప్రభుత్వం తక్షణమే సంబంధిత వర్గాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కోరింది. సినీ పరిశ్రమకు నష్టం వాటిల్లకుండా, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన రీతిలో ధరలు, నిబంధనలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఛాంబర్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.