సినీ పరిశ్రమలో నటీనటులు కానీ, ఇతర టెక్నీషియన్లు కానీ రిటైర్మెంట్ తీసుకోవడం సాధారణమే. కానీ, వారు ఏదీ అంత త్వరగా అధికారికంగా ప్రకటించరు. అయితే, ప్రముఖ నటి తులసి మాత్రం తాను ఈ ఏడాది డిసెంబర్ 31తో నటనకు రిటైర్మెంట్ ఇస్తున్నానంటూ అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ పెట్టింది.
తులసి ఆమెకు మూడున్నర నెలల వయసు ఉన్నప్పుడే నటన రంగంలో అడుగు పెట్టింది. తులసి తల్లి అలనాటి సావిత్రి స్నేహితురాలు కావడంతో, జీవన తరంగాలు అనే సినిమాలో ఉయ్యాలలో వేసే పాపాయి పాత్ర కోసం తులసి తల్లిని అడిగారు. అలా తులసి సినీ రంగ ప్రవేశం చేసింది.
Also Read :Krithi Shetty : కృతిశెట్టిపై కనికరం చూపని కోలీవుడ్
నాలుగేళ్ల నుంచి బాల నటిగా మారి తెలుగు, తమిళ, కన్నడ, భోజ్‌పురి సినిమాల్లో నటించింది. కొన్ని సినిమాలలో ఆమె హీరోయిన్‌గా కూడా నటించింది. కన్నడ డైరెక్టర్ శివమణిని వివాహం చేసుకున్న ఆమె అప్పట్లోనే నటనకు బ్రేక్ ఇచ్చింది. అయితే, తర్వాత ఆమెకు తల్లి పాత్రలు రావడంతో మళ్ళీ నటించడం మొదలుపెట్టింది. అలా తెలుగులో ఆమె చెప్పుకోదగ్గ సినిమాలు చాలా చేసింది. ఎంతో మంది స్టార్ హీరోలకు, స్టార్ హీరోయిన్లకు ఆమె తల్లి పాత్రలో మెరిసింది. అయితే, గత కొంతకాలంగా ఆమె చాలా తక్కువగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు సాయిబాబా మీద తనకు ఉన్న భక్తిని చాటి చెప్పుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్న ఆమె, ఈ ఏడాది డిసెంబర్ నెల 31వ తేదీన తాను సాయిబాబా దర్శనానికి వెళుతున్నానని, ఆ రోజే తన రిటైర్మెంట్ కూడా ఉంటుందని ప్రకటించింది.