ఈ వారం గట్టిగానే చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే వాటిలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవైనా ఉన్నాయంటే అవి, రష్మిక మందన హీరోయిన్ సెంట్రిక్ సినిమా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో పాటు సుధీర్ బాబు హీరోగా నటించిన జటాధర. అలాగే మసూద ఫేమ్ తిరువీర్ నటిస్తున్న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. వాస్తవానికి ఈ మూడు సినిమాలలో నలుగురికి ఈ శుక్రవారం చాలా కీలకం.
రష్మిక:
అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వస్తే, ముందుగా రష్మిక గురించే చెప్పుకోవాలి. నిజానికి రష్మిక కెరీర్‌లో పుష్ప, ఛలో సహా ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ ఉన్నాయి, కానీ ఆమె మొట్టమొదటిసారిగా ఒక ఉమెన్ సెంట్రిక్ సినిమాలో కనిపిస్తోంది. ఈ సినిమా హిట్ అయ్యి కాసుల వర్షం కురిస్తేనే ఆమెతో ఫ్యూచర్‌లో ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేసే దర్శక నిర్మాతలకు కాస్త ధైర్యం వస్తుంది. ఇప్పటికైతే ఎర్లీ ప్రీమియర్స్ చూసిన వారి నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
రాహుల్ రవీంద్రన్:
ఇక ఆ సినిమాని డైరెక్ట్ చేసిన నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌కి కూడా ఈ సినిమా చాలా ముఖ్యం. ఎందుకంటే, చివరిగా ఆయన డైరెక్ట్ చేసిన మన్మధుడు 2 సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. నిజానికి ఆయన దర్శకత్వం కోసం నటుడిగా సినిమాలు కూడా వదులుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు ఈ సినిమా రిసల్ట్ కనుక ఏమాత్రం తేడాపడినా ఆయనకు ఇబ్బందికరమే. కాబట్టి ఈ వారం ఆయనకు చాలా క్రుషియల్ అనే చెప్పాలి.
Also Read : Raghava Lawrence : భారీ ధర పలికిన కాంచన 4 రైట్స్
సుధీర్ బాబు: సుధీర్ బాబు నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు కానీ, ఆయన ఎంచుకుంటున్న స్క్రిప్ట్స్ కొన్నిసార్లు సినిమాలను ఫెయిల్ అయ్యేలా చేశాయి. నిజానికి ఆయన సినిమాలు అనౌన్స్ చేసినప్పుడు అంచనాలు గట్టిగా ఏర్పడతాయి, తర్వాత మాత్రం అంచనాలను అందుకోలేక పోతాయి. అయితే ఆయన అనేక ప్రయత్నాల తర్వాత ఈసారి జటాధర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమాగా రూపొందించబడిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కీలకపాత్రలో నటిస్తోంది. ఈ సినిమా రిసల్ట్ సుధీర్ బాబు కెరీర్‌కి చాలా కీలకమనే చెప్పాలి.
తిరువీర్:
అచ్చ తెలంగాణ అబ్బాయిగా అందరిని ఆకర్షించిన తిరువీర్ మసూద్ అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత చేసిన పరేషాన్ సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోయినా, ఇప్పుడు చేసిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకంతో స్వయంగా తానే నిర్మాతగా కూడా మారాడు. కాబట్టి ఈ సినిమా హిట్ అవ్వడం తిరువీర్‌కి కూడా చాలా కీలకమనే చెప్పాలి. మరి చూడాలి ఈ వారం వీరిలో ఎవరెవరికి కలిసి వస్తుందో.
