The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!

Why The Paradise Got Delayed

Why The Paradise Got Delayed

The Paradise: ‘దసరా’ వంటి పాన్ – ఇండియా బ్లాక్‌బస్టర్‌తో మొదటి ప్రయత్నంలోనే బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు యువ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఇప్పుడు మళ్లీ అదే నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో ‘ది ప్యారడైజ్’ అనే మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న వేళ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

“ఆడియన్స్ అంటే భయపడుతున్నా.. అందుకే ఆ లేట్”
ప్యారడైజ్ ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు రాఘవ్ జుయల్‌తో నిర్వహించిన ‘నో ఫిల్టర్ జస్ట్ డ్రైవ్’ చిట్‌చాట్‌లో శ్రీకాంత్ ఓదెల తన మనసులోని అసలు భయాన్ని బయటపెట్టారు. “ప్రస్తుతం నాకు ఆడియన్స్ అంటే చాలా భయం వేస్తోంది. థియేటర్‌కు వచ్చే ప్రతి ఒక్క ప్రేక్షకుడు సంతృప్తి చెందాలన్నదే నా తపన. ఆ ఉద్దేశంతోనే చిన్న చిన్న అవుట్‌పుట్ విషయాల్లో కూడా ఎక్కడా అంగుళం కూడా రాజీ పడటం లేదు. ఈ పెర్ఫెక్షన్ వల్లే షూటింగ్ ఆలస్యమై ప్రొడక్షన్ ఖర్చులు పెరిగాయి, ఆర్టిస్టుల కాల్షీట్లపై ప్రభావం పడింది. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ఆడియన్స్‌కు ఒక అత్యుత్తమ అనుభూతిని అందించాలన్నదే నా తాపత్రయం” అని శ్రీకాంత్ కుండబద్దలు కొట్టారు. తన ఫస్ట్ చిత్రం ‘దసరా’తో పోలిస్తే ‘ది ప్యారడైజ్’ విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నమని శ్రీకాంత్ వివరించారు. ‘దసరా’ తీసే టైంలో సినిమా బిజినెస్ లెక్కలు, ప్రేక్షకుల రియాక్షన్స్ గురించి తనకు ఎలాంటి అవగాహనా లేదని, అంతా చాలా అమాయకంగా సాగిపోయిందని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో కేవలం సినిమా తీయడం మాత్రమే తన పని అని, మిగిలిన వ్యవహారాలన్నీ నాని, నిర్మాత సుధాకర్ చెరుకూరి చూసుకున్నారని చెప్పారు. కానీ ‘ది ప్యారడైజ్’ కి వచ్చేసరికి ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని తాకాయని, ప్రతి ఫ్రేమ్‌లోనూ తనపై పెద్ద బాధ్యత ఉందని వెల్లడించారు.

ప్రేక్షకులతో ఎప్పటికప్పుడు కనెక్ట్ అయి ఉంటూ, వారి రెస్పాన్స్‌కి అనుగుణంగా డబ్బింగ్, సౌండ్ వంటి సాంకేతిక అంశాలను సరిదిద్దుకునే పద్ధతిని తాను శ్రీకాంత్, నానిల నుంచే నేర్చుకున్నానని ఈ సందర్భంగా నటుడు రాఘవ్ జుయల్ ప్రశంసించారు. మోహన్ బాబు, కయాదు లోహర్, సోనాలి కులకర్ణి వంటి భారీ తారాగణంతో అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్‌తో వస్తున్న ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరాయి. దర్శకుడు ఇంత పక్కాగా, ప్రేక్షకుల పట్ల బాధ్యతగా చెక్కిన ఈ విజువల్ వండర్ సెప్టెంబర్ 24న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.