తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ కార్మిక సంఘాలతో భేటీ అయ్యారు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, ఫెడరేషన్ సభ్యులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, సినీ పరిశ్రమ, కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
Also Read:Ilayaraja: ఇళయరాజాతో పెట్టుకుంటే.. తిప్పలు తప్పవా?
“హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు” సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. “ప్రభుత్వం నుంచి సినిమా కార్మికులకు ఏమి కావాలో చర్చించుకుని చెప్పండి. ఈ ప్రభుత్వం మీది. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది. నేను కార్మికుల వైపు ఉంటాను. అదే సమయంలో నాకు రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యం” అని సీఎం భరోసా ఇచ్చారు. “సినిమా కార్మికులను విస్మరించవద్దని నిర్మాతలకు చెప్పాను. వారిలో నైపుణ్యాల పెంపుకు సహకరించాల్సిందిగా కూడా కోరాను. స్కిల్ యూనివర్సిటీలో సినిమా కార్మికులకు శిక్షణ ఇస్తాం. కార్మికులు కూడా తమ నైపుణ్యాలను పెంచుకోవాలి” అని ఆయన సూచించారు.
Also Read:Suman Shetty : ఆ డైరెక్టర్ కు రోజూ పూజ చేస్తున్న సుమన్ శెట్టి..
“పరిశ్రమలో పని వాతావరణాన్ని చెడగొట్టుకోవద్దు. సమ్మెలకు పోతే రెండు వైపులా నష్టం జరుగుతుంది. సమ్మె జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేం” అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. “అన్ని భాషల చిత్రాలు తెలంగాణలో షూటింగ్ జరిగేలా సహకరించాలి. చిన్న సినిమా నిర్మాతలకు కూడా సహకరించాలి” అని ఆయన పిలుపునిచ్చారు. సినిమా కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ అందజేసే ప్రయత్నం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. “సమస్యను సమస్యగానే చూస్తా. వ్యక్తిగత పరిచయాలను చూసుకోను” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సినిమా కార్మికుల తరపున నిర్మాతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని కూడా తెలిపారు. ఈ సమావేశంలో పదేళ్ల పాటు సినిమా వారికి అవార్డులు కూడా ఇవ్వలేదని, ఇంతకాలం సినీ కార్మికులను పిలిచి మాట్లాడిన ముఖ్యమంత్రి లేరని సినీ కార్మిక సంఘాల నాయకులు ప్రశంసించారు. ఈ భేటీ, తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు సూచిస్తోంది.
