మిల్కీ బ్యూటీ తమన్నా ముచ్చటగా మూడో వెబ్ సీరిస్ కు పచ్చ జెండా ఊపేసింది. ఇప్పటికే తెలుగులో ‘లెవన్త్ అవర్’, తమిళంలో ‘నవంబర్ స్టోరీ’ వెబ్ సీరిస్ లలో తమన్నా నటించింది. ‘లెవన్త్ అవర్’ బిజినెస్ వరల్డ్ నేపథ్యంలో సాగే వెబ్ సీరిస్ కాగా, ‘నవంబర్ స్టోరీ’ అందుకు పూర్తి భిన్నమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సీరిస్. ఈ రెండు వెబ్ సీరిస్ లలో తమన్నా నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో మరికొంతమంది నిర్మాతలు తమన్నాతో వెబ్ సీరిస్ చేసేందుకు ముందుకొచ్చారు. అందులో ఒక దానికి తమన్నా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ భాషల్లో రూపుదిద్దుకోబోతున్న ఈ రొమాంటిక్ డ్రామాను అరుణిమా శర్మ డైరెక్ట్ చేయబోంది. ఈ యేడాది సెప్టెంబర్ నుండి ఇది సెట్స్ పైకి వెళుతుంది. దీనిని దర్శకుడు దినేష్ విజన్ నిర్మించబోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు షెడ్యూల్స్ లో చిత్రీకరణ పూర్తి చేసుకునే ఈ వెబ్ సీరిస్ ను 2022లో అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేయబోతోంది. తమన్నాతో పాటు ఆషిమ్ గులాటీ ప్రధాన పాత్ర పోషించబోతున్న దీనికి ‘యారీ దోస్తీ’ అనే పేరు ఖరారు చేశారట. ఈ వెబ్ సీరిస్ కోసం అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి దినేశ్ విజన్ తో డీల్ కుదుర్చుకుందని వార్తలు వస్తున్నాయి. గత రెండు వెబ్ సీరిస్ కు భిన్నంగా తమన్నా ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉండే లవర్ పాత్రను పోషించబోతోందట. సో… తెలుగు, తమిళ వెబ్ సీరిస్ తర్వాత తమన్నా ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం హిందీ వెబ్ సీరిస్ చేస్తోందని అనుకోవచ్చు.