విభిన్న చిత్రాలతో, పాత్రలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువయ్యారు తమిళ స్టార్ హీరో సూర్య. రీసెంట్‌గా ‘రెట్రో’ తో మంచి హిట్ అందుకున్న సూర్య తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు వెంకీ అట్లూరితో ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ద్విభాషా చిత్రం కేవలం ప్రకటనతోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.33 గా తెరకెక్కనున్న ఈ చిత్రం.. నేడు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మమితా బైజు, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్, త్రివిక్రమ్ , తదితరులు పాల్గొన్నారు. నాగవంశీ నిర్మిస్తోన్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది.
సార్/వాతి, లక్కీ భాస్కర్ వంటి అద్భుతమైన సినిమాలతో వరుసగా ఘన విజయాలు సొంతం చేసుకొని, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు వెంకీ అట్లూరి. ఇప్పుడు మరో అద్భుతమైన కథతో అలరించడానికి సూర్యతో చేతులు కలిపారు. అయితే ఈ మూవీ కోసం నాగవంశీ ‘రెట్రో’ తెలుగు హక్కుల్ని తీసుకున్నాడట. కానీ ఈ మూవీ వల్ల అతనికి చాలా నష్టం వాటిల్లిందని సమాచారం. ఆ మొత్తాన్ని ఇందులో కవర్ చేసేలానే ఉన్నాడు నాగవంశీ. ఇక ప్రేమలు తర్వాత హీరోయిన్ మమితకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆల్రెడీ విజయ్‌తో ‘జన నాయగన్’ చేస్తోంది. ఇప్పుడు సూర్యతో మూవీని ఓకే చేసుకుంది. రీసెంట్‌గానే ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ మూవీలో వింత లుక్‌లో కనిపించింది. ఇక తెలుగులోనూ ఈ క్రేజీ బ్యూటీకి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయట. అయితే సూర్య కూడా తెలుగు ప్రేక్షకులను అలరించి చాలా కాలం అవుతుంది. మరీ ఈ మూవీతో అయిన అలరిస్తాడా..? చూడాలి.