కరోనా కష్ట కాలంలో తమ వంతు సాయం చేయడానికి ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు సెలెబ్రిటీలు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో కొంతమంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే చాలామంది ప్రాణాలు బలి తీసుకుంది కరోనా మహమ్మారి. అయితే అలా కరోనాతో ప్రాణాలొదిలేసిన చాలా కుటుంబాల్లో మిగతా వారు అనాథలుగా మిగులుతున్నారు. ముఖ్యంగా కరోనా కారణంగా తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోతే అభం శుభం తెలియని చిన్నారులు అనాథలుగా మారిపోతున్నారు. ఇలాంటి సమయంలో వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోంది. తాజాగా యంగ్ హీరో సందీప్ కిషన్ అలాంటి పిల్లలకు నేనున్నాను అంటూ ముందుకొచ్చారు. ‘మీకు తెలిసి కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఎవరున్నా ఉంటే sundeepkishancovidhelp@gmail.com ను సంప్రదించండి. వీలైనంత వరకు నా టీం, నేను వారిని జాగ్రత్తగా చూసుకుంటాం. రెండేళ్ల వరకు వారి తిండి, చదువుకు సంబంధించిన వ్యవహారాలను నేనే చూసుకుంటాను. ఇలాంటి కష్టసమయంలోనే మానవులు ఒకరికొకరు అండగా నిలబడాలి. అందరూ జాగ్రత్తగా ఉండండి. దయచేసి మీ చుట్టుపక్కల అవసరమైన వారికి మీకు చేతనైన సాయం చేయండి’ అంటూ సందీప్ కిషన్ ట్వీట్ చేశాడు. ఇక కరోనా కారణంగా ఎంతో మంది చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారుతోందని, ప్రభుత్వాలు, ఆర్ఫనేజ్ సంస్థలు వారిని కాపాడడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ సోనూసూద్ ఇటీవలే విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.