కరోనా కష్టకాలంలో బాధితులను ఆదుకోవడానికి, తమకు తెలిసిన వారి సాయంతో పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. గాయనీ స్మిత సైతం ఈ జాబితాలో చేరారు. ఎ.పి. ఎంటర్ పెన్యూర్ ఆర్గనైజేషన్, ఈషాకు చెందిన అలై ఫౌండేషన్ సహకారంతో స్మిత రెండు తెలుగు రాష్ట్రాలలో ఆరు ప్రాంతాలలో కొవిడ్ బాధితులను రక్షించే పనిలో పడ్డారు. విజయవాడ, వెస్ట్ గోదావరి, అనంతపూర్, శ్రీకాకుళం, హైదరాబాద్, విశాఖపట్నంలో హెల్ప్ లైన్స్ ను ఏర్పాటు చేసి బాధితులకు సహాయాన్ని అందిస్తున్నారు. దీనితో పాటు ఆక్సిజన్ సౌకర్యం ఉన్న ఆరు వందల బెడ్స్ ను అందుబాటులో ఉంచారు. అలానే కరోనా బాధితులు అధైర్య పడకుండా వారికి టెలిఫోన్ లోనూ వైద్య సహకారం, సలహాలూ సూచనలు అందించే విధంగా ఓ డాక్టర్ల బృందాన్ని నియమించారు. చక్కని గాయనిగా, ఆధ్యాత్మిక వేత్తగానే కాకుండా మానవతా వాదిగానూ స్మిత చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలను పలువురు అభినందిస్తున్నారు.