Sing Geetham OTT Release: ‘సింగ్‌ గీతం’ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Sing Geetham

Sing Geetham

Sing Geetham OTT Release: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నుంచి వచ్చిన సరికొత్త ప్రయోగాత్మక చిత్రం ‘సింగ్‌ గీతం’ (Sing Geetham). వైజయంతి మూవీస్ పతాకంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం.. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. అయాన్, అహల్య, శాలిని ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ మూవీ, గత నెల జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై క్లాసిక్ టాక్‌తో పాటు ప్రశంసలు అందుకుంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు తెలుస్తోంది. జులై 9వ తేదీ నుంచి ఈ క్రేజీ ప్రయోగాత్మక చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన స్వరాలు సమకూర్చగా, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ కేవీ అనుదీప్, రాహుల్ రవీంద్ర, నివేద పేతురాజ్ వంటి స్టార్స్ క్యామియో పాత్రల్లో మెరిసి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశారు.

కథ..

ప్రతాప్ (అయాన్) తన తండ్రి (రాహుల్ రవీంద్రన్) ఆస్తులు వెతుక్కుంటూ కుబేరపురం అనే ఊరికి వెళతాడు. ఆ కుబేరపురం నిజానికి ఒక చెట్టు కూడా లేని ఒక మైనింగ్ ప్రాంతంగా మారిపోయి ఉంటుంది. అయితే, ఆ కుబేర గోల్డ్ మైన్స్ లో తన తండ్రికి వాటా ఉందని తెలుసుకుని, ప్రస్తుతం ఆ మైన్ నడుపుతున్న రేణు (శాలిని)ని కలిసి వాటా పొందే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆమె దాన్ని ఒక విదేశీయుడికి అమ్మే ప్రయత్నం చేస్తున్న విషయం తెలుసుకుని, తాను కూడా ఆ ప్రయత్నంలో భాగమవుతాడు. కాని, అదే మైన్ లో పనిచేస్తూ ఉండే గౌరి (అహిల్య బమ్రో) కారణంగా ఆ ఊరు మొత్తం ఒక శాపంలో చిక్కుకుంటుంది. ఆ శాపం వలన ఆ ఊరి వారందరి మాటలు, పాటల రూపంలోకి మారిపోతాయి. అయితే ఈ శాపం ఎందుకు వచ్చింది? ఆ శాపం నుండి ఆ ఊరి ప్రజలంతా విమోచనం చేసుకోగలిగారా? తన తండ్రి వాటా కోసం కుబేరపురం వచ్చిన ప్రతాప్ ఆ వాటా పొందగలిగాడా? చివరికి ఏమైంది అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.