SIIMA 2026 Nominations: దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డులుగా గుర్తింపు పొందిన 14వ నెక్సా సైమా (SIIMA) అవార్డ్స్ నామినేషన్స్ అధికారికంగా విడుదలయ్యాయి. 2025లో విడుదలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల ఉత్తమ చిత్రాలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఈ ఏడాది నామినేషన్స్ ప్రకటించారు. ఈసారి నాలుగు భాషల్లో అత్యధిక నామినేషన్స్ సాధించిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు నుంచి ‘మిరాయ్’, తమిళం నుంచి ‘డ్రాగన్’, కన్నడ నుంచి ‘కాంతార: చాప్టర్ 1’, మలయాళం నుంచి ‘లోకా’ చిత్రాలు అత్యధిక నామినేషన్స్ దక్కించుకుని తమ సత్తా చాటాయి.
విభిన్న కథాంశాలు, అద్భుతమైన నటన, ప్రతిభావంతమైన దర్శకత్వం, సాంకేతిక నైపుణ్యం, సంగీతం వంటి అన్ని విభాగాల్లో విశేషంగా రాణించిన సినిమాలకు ఈ ఏడాది సైమా గుర్తింపు లభించింది. 2025లో దక్షిణ భారత సినీ పరిశ్రమ సాధించిన విజయాలను ప్రతిబింబించేలా ఈ నామినేషన్స్ ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం విడుదలైన సైమా నామినేషన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, తమ అభిమాన హీరోలు, సినిమాలు ఎన్ని అవార్డులు గెలుచుకుంటాయోనని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

