ప్రముఖ హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తన ఫోన్ నంబర్ లీక్ అయిందని, బిజెపి తమిళనాడు ఐటి సెల్ తన నంబర్ లీక్ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగా ఆయనకు, ఆయన కుటుంబానికి అత్యాచారం, డెత్ బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు సిద్ధార్థ్. ఈ మేరకు ట్వీట్లో “నా ఫోన్ నంబర్ ను తమిళనాడు బిజెపి సభ్యులు, బిజెపి తమిళనాడు ఐటి సెల్ లీక్ చేసారు. నాకు, నా కుటుంబానికి 24 గంటల్లో 500కు పైగా అత్యాచారం చేస్తామని, చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి. అన్ని నెంబర్లు రికార్డ్ చేశాను (బిజెపి లింకులు మరియు డిపిలతో). వాటిని పోలీసులకు ఇస్తున్నాను. నేను నోరు మూసుకుని కూర్చోను. ప్రయత్నిస్తూ ఉంటా’ అంటూ నరేంద్ర మోడీని, అమితా షాను ట్యాగ్ చేశారు సిద్ధార్థ్. అంతేకాదు తనను సోషల్ మీడియాలో బెదిరించిన వారి స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ “బిజెపి టిఎన్ సభ్యులు నిన్న నా నంబర్ లీక్ చేసి, నన్ను దాడి చేయమని, వేధించమని చెప్పారు. నన్ను బెదిరించిన అనేక సోషల్ మీడియా పోస్టులలో ఇది ఒకటి. కోవిడ్ నుంచి సర్వైవ్ అవ్వగలం కానీ ఇలాంటి పీపుల్ తో సర్వైవ్ అవ్వగలమా ?” అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సిద్ధార్థ్ అధికార బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన అసమ్మతిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇటీవలే కోవిడ్ సంక్షోభ నిర్వహణపై అధికార పార్టీని విమర్శించారు సిద్ధార్థ్.
కాగా స్కామ్ 1992 అనే వెబ్ సిరీస్లో జర్నలిస్ట్ సుచేతా దలాల్ పాత్రలో నటించిన నటి శ్రేయా ధన్వంథరి సిద్ధార్థ్ పోస్ట్ పై స్పందిస్తూ “ఇది దారుణం” అని కామెంట్ చేశారు.