సీనియర్ కో-డైరెక్టర్, నటుడు ఇరుగు గిరిధర్ (64) అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూశారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం, ఇరంగారిపల్లిలో 1957 మే 21న గిరిధర్ జన్మించారు. చిత్తూరు జిల్లాలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత 1982లో చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఎ. కోదండరామిరెడ్డి, గుణశేఖర్, ఇవీవీ సత్యనారాయణ తదితరుల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. వినోద్ కుమార్, ఆమని, ఇంద్రజ ప్రధాన పాత్రలు పోషించిన ‘శుభముహూర్తం’ చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు. అయితే ఆ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో గిరిధర్ కు దర్శకుడిగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత తిరిగి కో-డైరెక్టర్ గా ‘అన్నవరం, గుడుంబా శంకర్, వన్, సుప్రీమ్, వరుడు’ వంటి సినిమాలు పనిచేశారు. ‘ఎక్స్ ప్రెస్ రాజా, 100 పర్శంట్ లవ్, సర్దార్ గబ్బర్ సింగ్, శ్రీమంతుడు, సుప్రీమ్’ వంటి దాదాపు ఇరవై చిత్రాలలో నటించారు. అలానే కొన్ని టీవీ కార్యక్రమాలను రూపొందించారు.
Read Also : ఎట్టకేలకు స్పందించిన శిల్పాశెట్టి… భర్త కేసుపై సుదీర్ఘ వివరణ
కొంతకాలం క్రితం హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గిరిధర్ కోమాలోకి వెళ్ళిపోయారు. ఆ మధ్య దర్శకుడు సుకుమార్ వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. గిరిధర్ కు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు విదేశాల నుండి రాగానే ఈ రోజు (సోమవారం) అంత్యక్రియలను పూర్తి చేయబోతున్నారు.