ప్రముఖ నటీమణి శృతి హాసన్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ పాత్రలో కనిపించనుండగా, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో శృతి హాసన్ బిజీగా పాల్గొంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తన పాత్రపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Also Read : Aamir Khan : ఆమిర్ ఇంటికి హఠాత్తుగా 25 మంది పోలీసులు.. అసలేం జరిగింది?
ఓ ఆల్బమ్ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ను కలిసిన శృతి, అప్పుడే ‘కూలీ’ స్క్రిప్ట్ గురించి విన్నట్లు చెప్పారు. అందులో స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ గా కనిపించే అవకాశం తనకు చాలా బాగా నచ్చిందని పేర్కొంది. ఆమె ఈ చిత్రంలో సత్యరాజ్ కుమార్తె పాత్ర పోషిస్తోంది. అంతేకాదు ‘రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి పెద్ద స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకోడం నాకు ఎంతో గొప్ప అనుభూతినిచ్చింది, ఈ జర్ని నా కెరీర్‌లో ఓ ప్రత్యేకం. ఇక నాకు సంగీతం అంటే ప్రాణం , సినిమాల్లో ఓ మ్యూజిషియన్ పాత్ర చేయాలన్నదే నా చిరకాల కోరిక’ అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. “పాప టేస్ట్ అదిరిపోయిందిగా!” అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.