ప్రముఖ నటుడు, న్యాయవాది సి.వి.ఎల్. నరసింహారావు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నారు. కళాకారులకు ప్రాంతీయ సరిహద్దులు ఉండవని, వారిని లోకల్ – నాన్ లోకల్ గా చూడటం తప్పని ఇప్పటికే ప్రకాశ్ రాజ్ వర్గం చెబుతుండగా, సీవీఎల్ నరసింహారావు మాత్రం తన ఎన్నికల నినాదం ‘తెలంగాణ వాదం’ అని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా తెలంగాణా కళాకారులు ఇబ్బంది పడుతున్నారని, అలానే ఆంధ్ర ప్రాంతానికి చెందిన చిన్న, పేద, మధ్య తరగతి కళాకారులకూ సరైన అవకాశాలు దక్కడం లేదని వాపోయారు.
Read Also : ఈషాకు గాయం.. ఆ మచ్చపై అభిమానుల ఆందోళన
పదేళ్ళ క్రితం ‘మా’ అసోసియేషన్ పరభాషా నటుల విషయంలో ఏకగ్రీవంగా ఓ తీర్మానం చేసుకుందని, కానీ దానిని ఎవ్వరూ పాటించడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ‘మా’ అసోసియేషన్ లోనూ రెండు విభాగాలను ఏర్పాటు చేసి విడివిడిగా ఎన్నికలు జరపాల్సిందని, కానీ అలా జరగలేదని అన్నారు. ఇప్పటికిప్పుడు ఆ రకమైన విభజన కుదరదు కాబట్టి… ఈసారి జరిగే ‘మా’ ఎన్నికల్లో 18 మంది కార్యవర్గ సభ్యుల్లో తెలంగాణ వారికి 9, అలానే రెండు ఉపాధ్యక్ష, రెండు సంయుక్త కార్యదర్శుల పదవుల్లో ఒక్కొక్కటి తెలంగాణ వ్యక్తికి కేటాయించాలని, జనరల్ సెక్రటరీ లేదా ట్రెజరర్ గా తెలంగాణ వారిని నియమించాలని ఆయన కోరారు. ఎన్నికల తేదీని ప్రకటించే సమయానికి తన ప్యానెల్ ను ఏర్పాటు చేస్తానని సీవీఎల్ నరసింహారావు తెలిపారు.