బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ చిత్రంలో నుంచి ‘సీటిమార్’ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రంలోని ‘సీటిమార్’ సాంగ్ ను హిందీ ‘రాధే’లో రీమేక్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించారు సల్మాన్ ఖాన్. “థ్యాంక్ యూ అల్లు అర్జున్… సీటిమార్ సాంగ్ లో మీ పెర్పార్మెన్సు చాలా బాగుంది. మీ డ్యాన్స్, స్టైల్… మీరు సింప్లి ఫెంటాస్టిక్… మీరు, మీ ఫ్యామిలీ జాగ్రత్తగా ఉండండి… థ్యాంక్ యూ బ్రదర్’ అంటూ ట్వీట్ చేశారు సల్మాన్. ఇక ‘రాధే’లో సీటిమార్’ సాంగ్ తీసుకోవడానికి ముందు దర్శకుడు ప్రభుదేవా… డీఎస్పీ దగ్గర గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నారట. ‘సీటిమార్’ హిందీ వెర్షన్‌ను దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచారు. ఈ పాట హిందీలో కూడా స్మాషింగ్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. కాగా ‘రాధే’కు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. సల్మాన్ ఈ చిత్రాన్ని థియేటర్లలో, డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈద్ కానుకగా ‘రాధే’ 13 మే 2021న థియేటర్లలోకి రానుంది. ‘సీటిమార్’ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.