టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానులకు కరోనా భలే పరీక్ష పెడుతోంది. తమ అభిమాన హీరోల సినిమాల విడుదల విపరీతంగా వాయిదా పడటంతో వారంతా చాలా డీలా పడిపోతున్నారు. అయితే మధ్య మధ్యలో కాస్తంత అప్ డేట్స్ వస్తే వాటితో తృప్తి పడొచ్చు అనుకుంటే అదీ జరగడం లేదు. మరీ ముఖ్యంగా ఎన్టీయార్, ప్రభాస్, మహేశ్ బాబు ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతంగా ఉంది. మహేశ్ బాబు సినిమా ఇక ఈ యేడాది ఉండదని తెలిసిపోయినా… ఏదో ఒక అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ మూవీకి సంబంధించి టీజర్ వస్తుందని భావిస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే టీజర్ విడుదలయ్యే దాఖలాలు కనిపించడం లేదు. జనాలు కరోనాతో నానా ఇబ్బందులు పడుతున్న వేళ తమ కొత్త సినిమా టీజర్ ను విడుదల చేయడం సబబుగా ఉండదని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఈ విషయంలో ‘సర్కారు వారి పాట’ టీమ్ కూడా ‘లైగర్’ బాటలోనే సాగుతోందని అనుకోవాలి. విజయ్ దేవరకొండ బర్త్ డే రోజున కూడా ‘లైగర్’ టీమ్ టీజర్ ను విడుదల చేయకుండా… వాయిదా వేసింది. ఇప్పుడు అదే ఫుట్ స్టెప్స్ లో వీళ్లు కూడా నడవబోతున్నారని తెలుస్తోంది.