Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?

Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu-Sanjay Leela Bhansali Movie on Cards: ‘సూపర్‌ స్టార్’ మహేష్ బాబు తదుపరి సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్న మహేష్.. ఆ తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నారనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్‌కు చెందిన స్టార్ డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది.

భారీ చిత్రాలు, అద్భుతమైన సెట్లు, రిచ్ విజువల్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. గత కొంతకాలంగా తెలుగు స్టార్ హీరోలతో సినిమా చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి పలువురు టాప్ హీరోలతో భన్సాలీ చర్చలు జరిపినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా భన్సాలీ చూపు మహేష్ బాబుపై పడినట్లు టాక్. అంతేకాదు ఇటీవల భన్సాలీ స్వయంగా మహేష్ బాబును కలిసి ఓ కథను వినిపించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. భన్సాలీ మార్క్‌లో ఉండే భారీ సెట్లు, గ్రాండ్ విజువల్స్, ఇంటెన్స్ డ్రామాతో కూడిన కథను మహేష్‌కు వివరించినట్లు సమాచారం.

అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం మహేష్ బాబు పూర్తిగా వారణాసి సినిమాపైనే దృష్టి పెట్టాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తయి, విడుదలైన తర్వాతే తన తదుపరి సినిమాపై సూపర్‌ స్టార్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు మహేష్ తదుపరి లైనప్‌లో ఇప్పటికే పలువురు క్రేజీ దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందనే ప్రచారం కొంతకాలంగా కొనసాగుతోంది. ఇప్పుడు సంజయ్ లీలా భన్సాలీ పేరు కూడా తెరపైకి రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.