బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ తో హీరోహీరోయిన్లుగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టైగర్ 3’. గత ఏడాది లాక్డౌన్ నిబంధనలు సడలించినప్పుడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. కానీ మళ్ళీ ముంబైలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా కోవిడ్-19 కేసులు ఉధృతంగా పెరగడంతో అక్కడి ప్రభుత్వం మరోసారి పూర్తిగా లాక్ డౌన్ విధించింది. దీంతో ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ‘టైగర్ 3’ సెట్ పై భారీ ఎఫెక్ట్ పడింది. దీంతో ఆ సెట్ ఇక షూటింగ్ కు పనికిరాకుండా తయారయ్యింది. అందుకే తాజాగా ఈ ప్రాజెక్ట్ మేకర్స్ దాదాపు 100-150 మంది కార్మికులకు ఈ సెట్ ను కూల్చే పనిని అప్పగించారట. దీని కారణంగా ‘టైగర్-3’ నిర్మాతలకు 8-9 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ‘టైగర్ 3’ను భారీ స్థాయిలో నిర్మించారు.