ఆమీర్, కిరణ్ రావ్ డైవోర్స్. ఇప్పుడు బాలీవుడ్ లో ఇదో పెద్ద టాక్ ఆఫ్ ద టౌన్. అయితే, ఆమీర్ జీవితంలో ఇది రెండో విడాకుల వ్యవహారం. ఇంతకు ముందు ఆయన మొదటి భార్య రీనా దత్తాకి 16 ఏళ్ల కాపురం తరువాత బైబై చెప్పేశాడు. కాకపోతే, అప్పుడు ‘దంగల్’ ఖాన్ మానసిక పరిస్థితి చాలా దారుణంగా, దయనీయంగా ఉండేదట. అప్పుడు ‘దబంగ్’ ఖాన్ నన్ను డిప్రెషన్ నుంచీ బయటపడేశాడని చెప్పాడు ఆమీర్!
కొన్నేళ్ల క్రితం ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఆమీర్ ఖాన్ తన మొదటి విడాకుల గురించి మాట్లాడాడు. రీనా దత్తాతో విడిపోయాక ఆయన తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాడట. అప్పుడు సల్మాన్ తనంత తానుగా ఆమీర్ వద్దకి వచ్చి మాట కలిపాడట. తరువాత ఇద్దరూ కలసి మందు తాగుతూ చాలా విషయాలు మాట్లాడుకున్నారట. అలా వారిద్దరి మధ్యా డీప్ ఫ్రెండ్ షిప్ ప్రారంభమైంది.
Read Also : ‘బాలికా వధూ 2’… మరో బాల్య వివాహం… మరో ‘ఆనంది’!
సల్మాన్, ఆమీర్ తమ కెరీర్స్ మొదట్లోనే కలసి పని చేశారు. వారిద్దరూ నటించిన ‘ఆందాజ్ అప్నా అప్నా’ బాలీవుడ్ చరిత్రలో క్లాసిక్ గా మిగిలిపోయింది. అయినా కూడా మరెప్పుడూ ‘దబంగ్’ ఖాన్ తో ‘దంగల్’ ఖాన్ వర్క్ చేయలేదు. వారిద్దరి మల్టీ స్టారర్ మళ్లీ ఇంత వరకూ రాలేదు. అందుక్కారణం సల్మాన్ ప్రవర్తన ఆమీర్ కి నచ్చకపోవటమే. ‘అందాజ్ అప్నా అప్నా’ సినిమా టైంలో సల్మాన్ తనని అవమానించేలా, బాధించేలా ప్రవర్తించాడని ఆమీర్ చెప్పాడు! అందుకే, అటుపైన తాను భాయ్ కి బైబై చెప్పేశానని కరణ్ కి వివరించాడు. కానీ, రీనా దత్తాకి డైవోర్స్ ఇచ్చాక సల్మాన్ ఖానే స్వయంగా చొరవ తీసుకుని ఇద్దరి మధ్యా స్నేహానికి కొత్త పునాదులు వేశాడట!
రెండు పెళ్లిల్లు, రెండు డైవోర్స్ ల అనుభవం ఉన్న ఆమీర్ కి… కిరణ్ రావ్ విడాకుల తరువాత కూడా… మన బ్యాచిలర్ భాయ్ జాన్ సల్మాన్ కౌన్సిలింగ్ ఇస్తాడో లేదో చూడాలి మరి!