పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత ‘వకీల్ సాబ్’గా జనం ముందుకొచ్చాడు. ఫస్ట్ డే ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి… ‘ఇది వసూల్ సాబ్’ అన్నవాళ్ళూ ఉన్నారు. అయితే… ‘వకీల్ సాబ్’ మూవీ వీకెండ్ కలెక్షన్ల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. చిత్ర నిర్మాత ‘దిల్’ రాజు అధికారికంగా ఇప్పటికి ఎలాంటి ప్రకటన చేయకపోవడం విశేషం. తెలంగాణాలో ఈ సినిమా ప్రీమియర్ షోస్ పడ్డాయి. కానీ… ఆంధ్రాలో పరిస్థితి వేరు. తొలి రెండు రోజులు అత్యధిక రేట్లకు కొన్ని చోట్ల టిక్కెట్లు అమ్మినా, ఆ తర్వాత కోర్టు ఆర్డర్ కారణంగా ఆదివారం నుండి మామూలు రేట్లకే టిక్కెట్లు సేల్ చేస్తున్నారు. అయితే టిక్కెట్ ధర తగ్గడం వల్ల కూడా ‘వకీల్ సాబ్’ కలెక్షన్లు పెరిగాయని కొందరు చెబుతున్నారు. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా ‘వకీల్ సాబ్’ వీకెండ్ లో వంద కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే… మరికొందరు మాత్రం మన చుట్టుపక్కల రాష్ట్రాలలోని థియేటర్ల ఆక్యుపెన్సీ 50 శాతమే ఉన్నందువల్ల ఆ ప్రభావం ‘వకీల్ సాబ్’ కలెక్షన్ల మీద పడ్డాయని చెబుతున్నారు. ఒకటి మాత్రం నిజం… పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత వచ్చినా బాక్సాఫీస్ బరిలో తన సత్తాను చాటుకున్నాడు.
‘వకీల్ సాబ్’ మూవీ విడుదలకు ముందే భారీ మొత్తంలో బిజినెస్ జరగడంతో నిర్మాత దిల్ రాజుకు టేబుల్ ప్రాఫిట్ లభించిందని తెలుస్తోంది. అలానే ఇప్పటికే బయర్లందరికీ 60 శాతం పైగా రికవర్ అయ్యిందట. సో… ‘వకీల్ సాబ్’ జోరు ఇలానే ఉంటే… రెండు మూడు రోజుల్లో మిగిలిన మొత్తం కూడా రికవర్ అయ్యి, వాళ్ళంతా లాభాల బాట పట్టేస్తారు. మరో విశేషం ఏమంటే… ఈ నెల16న రావాల్సిన నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ మూవీ వాయిదా పడింది. సో… ఈ శుక్రవారం కూడా మరో పెద్ద సినిమా లేదీ లేదు. పై పెచ్చు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు… ఇంతవరకూ థియేటర్ల ఆక్యుపెన్సీని తగ్గించే ఆలోచన చేస్తున్నట్టు కూడా కనిపించడం లేదు. ఇక్కడ నాగార్జున సాగర్ శాసన సభ, అక్కడ తిరుపతి పార్లమెంట్ కు ఓటింగ్ పూర్తయితే తప్ప, మన ప్రభుత్వాలు కరోనా కట్టడిపై దృష్టి పెట్టవని అంటున్నారు. ఈ నేపథ్యంలో ‘వకీల్ సాబ్’కు మరో పది రోజుల పాటు తిరుగుండదన్నది ఫిల్మ్ నగర్ టాక్! మరి ఇది వకీల్ సాబ్ కి ఎంత వరకూ ఆడ్వాంటేజ్ అవుతుందన్నది ఆడియన్స్ ఆసక్తిపై ఆధారపడి ఉంది. కరోనా సెకండ్ వేవ్ భయం లేకుండా థియేటర్లకు క్యూ కడితే రికార్డ్స్ ఖాయం. చూద్దాం ఏం జరుగుతుందో!?