Rishab Shetty: బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌పై కన్నడ స్టార్ హీరో, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించిన ఆయన.. పురాణ కథలను తెరపై చూపించడం అంత సులభమైన విషయం కాదని పేర్కొన్నారు. మన చిన్నప్పటి నుంచి రామాయణం వంటి ఇతిహాసాలను వింటూ పెరిగామని, ప్రతి ఒక్కరి మనసులో ఈ పాత్రలపై, కథలపై ప్రత్యేకమైన ఊహలు ఉంటాయని రిషబ్ శెట్టి తెలిపారు. అలాంటి చిరస్థాయి కథలను ప్రేక్షకులను మెప్పించేలా అద్భుతమైన ప్రపంచంగా తీర్చిదిద్దిన చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు.
డైరెక్టర్ నితేష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రాలను ప్రత్యేకంగా అభినందించిన రిషబ్ శెట్టి.. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌ను తెరకెక్కించడం వెనుక ఉన్న కృషికి హ్యాట్సాఫ్ చెప్పారు. ఇక రామాయణంలోని ప్రతిష్ఠాత్మక పాత్రలను పోషించడం నటీనటులకు ఎంతటి బాధ్యతతో కూడుకున్నదో తనకు తెలుసని రిషబ్ పేర్కొన్నారు. ప్రతి ఒక్క నటుడు ఆ బాధ్యతను స్వీకరించి అద్భుతమైన నటనను అందించారని ప్రశంసించారు. ముఖ్యంగా రవి దుబే, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్‌ల నటనను కొనియాడారు. సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, హ్యాన్స్ జిమ్మర్ అందించిన నేపథ్య సంగీతం ప్రతి భావోద్వేగాన్ని మరింత బలంగా చూపించిందని రిషబ్ శెట్టి అన్నారు. వారి సంగీతం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఇక రణ్‌బీర్ కపూర్‌పై ప్రత్యేకంగా స్పందించిన రిషబ్.. రాముడి దివ్యమైన భావాన్ని ప్రేక్షకులకు అనుభూతి చెందేలా చేశారని అన్నారు. అలాగే యష్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి సన్నివేశంలో ఆయన నటన ఆకట్టుకుందని, ఆ పాత్రకు యష్ తప్ప మరెవరూ న్యాయం చేయలేరేమో అనిపించిందని పేర్కొన్నారు. కన్నడిగుడిగా యష్ తనను ఎప్పుడూ గర్వపడేలా చేస్తారని రిషబ్ శెట్టి తెలిపారు. ‘రామాయణ’ ట్రైలర్ తనను ఎంతగానో ఆకట్టుకుందని, చిత్ర బృందం చేసిన ప్రయత్నం అభినందనీయమని ఆయన తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
It’s not easy to convince people with the stories and characters of our epics. We have all grown up listening to them, and each of us carries our own imagination of these timeless legends. Hats off to the team for creating such an incredibly convincing world. @niteshtiwari22… pic.twitter.com/mLrLuUZqoi
— Rishab Shetty (@shetty_rishab) July 30, 2026

