యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాస్ట్రో
సినిమాలో నటిస్తున్నాడు. ఇది హిందీ చిత్రం అంథాధున్
కు రీమేక్. ఈ సంవత్సరం ఇప్పటికే నితిన్ నటించిన రెండు సినిమాలు చెక్
, రంగ్ దే
విడుదలయ్యాయి. అయితే ఇవేవీ ఆశాజనకమైన విజయాలను నితిన్ కు అందించలేదు. పైగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న మాస్ట్రో
ను ఓటీటీలో విడుదల చేయాలని నితిన్ తండ్రీ, ఆ చిత్ర నిర్మాత సుధాకర్ రెడ్డి భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరింత జాగ్రత్తగా సినిమాల ఎంపిక జరపాలని నితిన్ అనుకుంటున్నాడట. అందుకే ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ పేట
సినిమాను పక్కన పెట్టినట్టు సమాచారం. నిజానికి ఈ వార్త గత కొంతకాలంగా ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. అయితే…అందుకు కారణాలు మాత్రం అప్పుడు బయటకు రాలేదు. తాజా సమాచారం ప్రకారం శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న మహా సముద్రం
మూవీ కథకు… పవర్ పేట
కథకు సామీప్యత ఉందట. అదే సమయంలో దీనిని భారీ స్థాయిలో రెండు భాగాలుగా తెరకెక్కించాలని దర్శకుడు కృష్ణ చైతన్య భావించాడు. సో… ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు భాగాలుగా సినిమాను తెరకెక్కించడం కూడా కరెక్ట్ కాదనే నిర్ణయానికి నితిన్ వచ్చాడని అంటున్నారు. దాంతో ఈ ప్రాజెక్ట్ ఇక ఉండకపోవచ్చునని తెలుస్తోంది. ఇదిలా ఉంటే… నా పేరు సూర్య
తో తొలిసారి మెగాఫోన్ పట్టిన వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ తదుపరి చిత్రం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.