Ravi Teja: మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో ‘ఇరుముడి’ సక్సెస్ ఒక కీలక మలుపుగా మారింది. కొంతకాలంగా వరుస ప్లాప్‌లను ఎదుర్కొన్న రవితేజ.. ‘ఇరుముడి’తో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. ఈ సినిమా విజయంతో ఆయనకు కొత్త ఉత్సాహం రావడంతో పాటు.. ఇకపై సినిమాల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రవితేజ కెరీర్‌ను గమనిస్తే.. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేయడం ఆయనకు ఎప్పటి నుంచో అలవాటే. ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదలయ్యేలా ప్రాజెక్టులను ప్లాన్ చేసుకునేవారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. వెంటనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు. అయితే ‘ఇరుముడి’ తర్వాత మాత్రం ఆయన ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
గతంలో కథపై కంటే సినిమాల సంఖ్యపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు కనిపించే రవితేజ.. ఇప్పుడు స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి తొందరపడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కథ బలంగా ఉండటం, స్క్రీన్‌ప్లే ఆకట్టుకునేలా ఉండటం, తన పాత్రకు మంచి స్కోప్ ఉండటం వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భావిస్తున్నారట. ప్రస్తుతం రవితేజ చేతిలో డైరెక్టర్ హసిత్ గోలి తెరకెక్కించనున్న సినిమా ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే ‘ఇరుముడి’ సక్సెస్ తర్వాత రవితేజ తన నెక్ట్స్ ప్రాజెక్టుల క్రమాన్ని మార్చుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ‘సరిపోదా శనివారం’ ఫేమ్ వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన వార్తలు తెరపైకి వచ్చాయి. వివేక్ ఆత్రేయ, నిర్మాతలు లక్ష్మణ్, శ్రీని ఇటీవల రవితేజను కలిసి ‘ఇరుముడి’ సక్సెస్‌పై అభినందనలు తెలిపారు. అనంతరం వీరి కాంబినేషన్‌లో కొత్త సినిమా తెరకెక్కనున్నట్లు అధికారికంగా కూడా సమాచారం వచ్చింది.
తాజా రిపోర్టుల ప్రకారం.. తొలుత హసిత్ గోలి సినిమాను పూర్తి చేసిన తర్వాత వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని భావించారు. అయితే ‘ఇరుముడి’ ఇచ్చిన సక్సెస్‌తో రవితేజ తన లైనప్‌ను మరోసారి పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కొన్ని రిపోర్టుల ప్రకారం హసిత్ గోలి సినిమాను తాత్కాలికంగా పక్కన పెట్టి వివేక్ ఆత్రేయ సినిమాను ముందుకు తీసుకెళ్లే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇక వివేక్ ఆత్రేయ సినిమాకు సంబంధించిన షూటింగ్ అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానుందని ఓ తాజా రిపోర్ట్ పేర్కొంది. అయితే ఈ విషయంపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు హసిత్ గోలి సినిమాను కూడా రవితేజ పూర్తిగా వదులుకున్నట్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. మొత్తంగా ‘ఇరుముడి’ సక్సెస్ రవితేజకు కేవలం బాక్సాఫీస్ కమ్‌బ్యాక్ మాత్రమే కాకుండా.. కథల ఎంపిక విషయంలోనూ కొత్త ఆలోచనను తీసుకొచ్చిందనే టాక్ వినిపిస్తోంది. గతంలో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లిన మాస్ మహారాజా.. ఇకపై కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, బలమైన కథతోనే ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నారట. నిజంగా ఈ మార్పు రవితేజ కెరీర్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

