కన్నడ సోయగం రష్మిక మండన్న షూటింగ్ కోసం తిరిగి ముంబై చేరుకుంది. కరోనా వ్యాప్తి తగ్గడంతో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులను ప్రకటించింది. దీంతో బాలీవుడ్ చిత్రనిర్మాతలు తమ సినిమాల షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన రెండవ బాలీవుడ్ ప్రాజెక్ట్ “గుడ్‌బై” షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి రష్మిక మండన్న ఈరోజు ముంబైలో అడుగుపెట్టింది. “గుడ్‌బై” చిత్రంలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తండ్రి-కూతుర్ల కథతో ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ అంశాలతో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘సూపర్ 30’ ఫేమ్ వికాస్ బెహల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఇక రష్మిక మొదటి బాలీవుడ్ చిత్రం “మిషన్ మజ్ను”. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు ఈ బ్యూటీ తెలుగు, తమిళ చిత్రాలతో కూడా బిజీగా ఉంది. తెలుగులో అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తుంది.