‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?

Rapo23 Jackie Shroff Villain

Rapo23 Jackie Shroff Villain

RAPO23: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ, తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన చిత్రం ‘RAPO23’. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమా ప్రీ-లుక్ పోస్టర్ ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో వెనుకకు తిరిగి నిలబడి, ఒక చేతిలో తుపాకీ, మరో చేతిలో టెడ్డీ బేర్ పట్టుకుని “లోన్ వుల్ఫ్” గా కనిపించిన రామ్ లుక్ కథపై భిన్నమైన అంచనాలను క్రియేట్ చేసింది. అయితే, ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఊహించని ట్విస్ట్ ఒకటి ఉందని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాలో రామ్ పోతినేనికి ప్రతినాయకుడిగా బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ నటిస్తున్నారనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన చాలా పవర్‌ఫుల్ నెగటివ్ రోల్ చేస్తున్నారని, ఇప్పటికే ఆయనపై కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారని తెలుస్తోంది. హీరోగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్న రామ్, సీనియర్ స్టార్ జాకీ ష్రాఫ్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. అయితే, ఆయన ఎంట్రీపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రాపో సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ స్వయంగా కథ అందించి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఒకవైపు గన్, మరోవైపు టెడ్డీ బేర్‌తో వెరైటీ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం టైటిల్ టీజర్‌ను త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి డైరెక్టర్‌గా మారిన రామ్, జాకీ ష్రాఫ్ వంటి సీనియర్ నటుడిని విలన్‌గా పెట్టి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.